వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును నీరుకార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌ను కొన్ని శక్తులు ప్రభావితం చేస్తున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య ఇంటి దొంగల పనేనని అనుమానాలు క్తమవుతున్న తరుణంలో.. ప్రతిపక్ష నేత జగన్‌ను సిట్ అధికారులు ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు.
హత్య జరిగి 40 రోజులు అయ్యింది, కేసును ఎందుకు కోల్డ్ స్టొరేజ్ లో పెట్టారు అని వర్ల రామయ్య ప్రశ్నలు సంధించారు. ఎవరి అదేశాల మేరకు ఇంటి దొంగలను అరెస్ట్ చేయలేదో సిట్ చెప్పాలని డిమాండ్ చేశారు. అవినాష్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు. ఆయనను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. జగన్, అవినాష్ కాల్ డేటా తీసుకుంటే అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. వివేకానంద రెడ్డి కూతురు సునీతకు హత్య ఎవరు చేశారో తెలుసని వర్ల రామయ్య అన్నారు. అంతేకాదు జగన్ కి తెలిసే తెలిసే హత్య జరిగిందని ఆరోపించారు. వివేకానంద రెడ్డి కేసుపై హైకోర్టు మాట్లాడొద్దు అని అందని, ఆ సాకుతో కేసు దర్యాప్తును వదిలేస్తారా అని వర్ల రామయ్య మండిపడ్డారు. ఈ కేసులో వెంటనే జగన్, అవినాష్, విజయసాయిరెడ్డిలను విచారించాలని వర్ల రామయ్య సిట్ అధికారులను డిమాండ్ చేశారు.