Vasundhara Raje about rajastan congress party
Rajastan: రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల కమ్ములాటల గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య ఎప్పటి నుంచో కొనసాగుతున్న కోల్డ్ వార్ ఆ పార్టీని చాలా రోజులుగా తికమక పెడుతోంది. కొద్ది రోజుల క్రితం అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలను కూడా ఒక మలుపు తిప్పింది.
కాగా, ఈ విషయమై రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నేత వసుంధర రాజే స్పందించారు. ఒక గ్రూపేమో ముఖ్యమంత్రి కుర్చీని వదలడానికి ఎంత మాత్రం ఇష్టపడటం లేదని, అదే సమయంలో మరొక గ్రూపు ముఖ్యమంత్రి కుర్చీని ఎలా లాక్కోవాలా అని ప్రయత్నిస్తోందని అన్నారు. వారికి ఎంత మాత్రం కుర్చీల గొడవ, పదవుల పందేరమే కానీ.. ప్రజా సమస్యలపై ప్రజా అవసరాలపై ఎలాంటి పట్టింపు లేదని ఆమె విమర్శలు గుప్పించారు.
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి గెహ్లాట్‌ను ముఖ్యమంత్రి చేశారని, అయితే ఆయన మాత్రం ఆ ప్రజల మాటలను అస్సలు వినడం లేదని రాజే విమర్శించారు. తప్పుడు ప్రచారం చేయడంలో అబద్ధాలు చెప్పడంలో గెహ్లాట్ చాలా నిష్ణాతుడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో ప్రజలు విసిగిపోయారని, రాబోయే రోజుల్లో వచ్చేది భారతీయ జనతా ప్రభుత్వమేనని ఆమె అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అశోక్ గెహ్లాట్‌ను గాంధీ కుటుంబం ప్రతిపాదించింది. అంతా ఓకే అయింది. అయితే ఉదయ్‌పూర్ ఒప్పందం ప్రకారం.. పార్టీలో ఒకరికి ఒక పదవి మాత్రమే ఉండాలి. దీంతో గెహ్లాట్‌ను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సూచించారు. దీనికి ఒప్పుకున్న ఆయన.. ఆ కుర్చీని ప్రత్యర్థి పైలట్‌కు ఇవ్వడానికి ససేమిరా అన్నారు. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం.. ఆ తర్వాత అధిష్టానం ఆగ్రహించి ఆయనను కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి తప్పించడం చకచకా జరిగిపోయాయి.
Gujarat Polls: ఆప్‌ను అర్బన్ నక్సల్స్‌తో పోలుస్తూ విరుచుకుపడ్డ ప్రధాని మోదీ