హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 80శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. భారీగా పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి ప్లస్ కానుంది అనేది చర్చకు దారితీసింది. ఏ పార్టీ అధికారంలోకి రానుందనేది ఆసక్తికరంగా మారింది. గురువారం(ఏప్రిల్ 11, 2019) రాత్రి వైసీపీ చీఫ్ జగన్ మీడియాతో మాట్లాడారు. పెరిగిన పోలింగ్ శాతం మాకే అనుకూలం అని చెప్పారు. భారీ మెజార్టీతో వైసీపీ గెలుపు ఖాయం అని, అధికారం మాదే అని జగన్ ధీమా వ్యక్తం చేశారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో ఈసారి విజయం తమదే అని జగన్ అన్నారు.
Read Also : రెడీ టు అప్లయ్ : SBIలో 8వేల 904 క్లర్క్ పోస్టులు
ఓటమి భయంతో సీఎం చంద్రబాబు దిగజారి వ్యవహరించారని జగన్ మండిపడ్డారు. ఎన్నికలు జరగకుండా చూసేందుకు, ఓటింగ్ శాతం తగ్గించడానికి చంద్రబాబు కుట్రలు పన్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా 80 శాతం మందికిపైగా ప్రజలు ఓటేశారని జగన్ అన్నారు. రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని జగన్ స్పష్టం చేశారు. 80 శాతం మందికిపైగా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారని, తాము ఏ పార్టీకి ఓటేశామనేది వీవీప్యాట్ స్లిప్‌లలో వారికి కనిపిస్తుందని జగన్ చెప్పారు. వాళ్లంతా సంతృప్తిగానే ఉన్నారన్న జగన్ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు.
ఓడిపోతున్నామని తెలిసే చంద్రబాబు, టీడీపీ నేతలు రీపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారని జగన్ అన్నారు. ప్రజలు భారీగా ఓటేయడం వైసీపీకి సానుకూల సంకేతమన్నారు. చంద్రబాబు అనే రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే సమస్యలొస్తున్నాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడారని జగన్ అన్నారు.
Read Also : విఫలమైన ఈసీ : చుక్కలు చూపించిన EVMలు