BRS MLAs Meet CM Revanth
CM Revanth Reddy Strategy : దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. బీఆర్‌ఎస్ టార్గెట్‌గా పావులు కదుపుతున్నారా? గులాబీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు.. అధిష్టానం అనుమతి లేకుండానే సీఎంను కలవడంలో ఆంతర్యం ఏంటి? సొంత పార్టీ ఎమ్మెల్యేలకే టైమ్ ఇవ్వని రేవంత్‌రెడ్డి.. అడగ్గానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఎందుకిచ్చారు ? రాజకీయ వ్యూహాల్లో భాగంగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయా ?
బీఆర్ఎస్ అనుసరించిన రాజకీయ వ్యూహాలనే రేవంత్ అమలు చేయనున్నారా?
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత.. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి.. గతంలో బీఆర్‌ఎస్ అనుసరించిన రాజకీయ వ్యూహాలనే అమలు చేయనున్నారనే చర్చ సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే వ్యూహాలు రచిస్తోందన్న ప్రచారం సాగుతోంది.
Also Read : అసలు హరీశ్ రావు ప్రోద్బలం లేకుండానే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇలా చేస్తారా?: రఘునందన్ రావు
బీఆర్ఎస్ టార్గెట్ గా రేవంత్ పావులు..
ఇప్పటికే స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలతో రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కొన్ని మున్సిపాలిటీల్లో తీర్మానాలు ప్రవేశపెట్టి.. గులాబీ పార్టీ పీఠాలను తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలంటే.. బలమైన నేతల మద్దతు కూడగట్టాలనే యోచనలో ఉంది. దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. బీఆర్‌ఎస్ టార్గెట్‌గా పావులు కదుపుతున్నారన్న చర్చ సాగుతోంది.
పార్టీ కీలక నేతలకు సమాచారం ఇవ్వకుండానే సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ..
మెదక్‌కు చెందిన నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు.. సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు.. పార్టీ కీలక నేతలకు సమాచారం ఇవ్వకుండానే భేటీ కావడం కారు పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే.. పార్టీ పెద్దలకు తమపై పూర్తి నమ్మకం ఉందని, కేవలం నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశామని చెబుతున్నారు ఆ నలుగురు ఎమ్మెల్యేలు.
Also Read : రేవంత్‌రెడ్డి సెక్యూరిటీ సిబ్బందిని మార్చేసిన ఇంటెలిజెన్స్ విభాగం.. ఎందుకంటే?
రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్.. దేనికి సంకేతం?
అయితే, ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలకే పూర్తిస్థాయి సమయం ఇవ్వని రేవంత్‌రెడ్డి.. బీఆర్‌ఎస్ శాసనసభ్యులకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం దేనికి సంకేతాలన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. గులాబీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునే అవకాశం ఉందనే చర్చ ఓవైపు సాగుతుండగా.. తామెప్పటికీ కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతామని చెబుతున్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.
మొత్తంమీద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్ ఎలాంటి చర్యలు చేపడుతుందనేది ఆసక్తిగా మారింది.
Also Read : కేసీఆర్ వెంటే ఉంటాం.. సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి?