Raghunandan Rao: అసలు హరీశ్ రావు ప్రోద్బలం లేకుండానే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇలా చేస్తారా?: రఘునందన్ రావు
మెజారిటీ ఉన్న సమయంలోనూ బీఆర్ఎస్ చేసిన పనిని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని అన్నారు.

Raghunandan Rao
కర్మ సిద్ధాంతం ఇప్పుడు బీఆర్ఎస్‌కు అనుభవంలోకి వస్తోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడమే నిదర్శనమని చెప్పారు. ఇవాళ రఘునందన్ రావు సిద్దిపేట జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మనమేం చేస్తే అదే మన వద్దకు తిరిగి వస్తుందని అన్నారు.
మెజారిటీ ఉన్న సమయంలోనూ బీఆర్ఎస్ చేసిన పనిని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో పార్టీలను చీల్చడానికి, ఆ పార్టీల నేతలను చేర్చుకోవడానికి బీఆర్ఎస్‌కు ఎడేళ్లు పెడితే కాంగ్రెస్‌కు ఏడు నెలలు కూడా పట్టడం లేదని ఆయన చెప్పారు. అసలు హరీశ్ రావు ప్రోద్బలం లేకుండా వీరు వెళ్తారా? అని అన్నారు.
బీఆర్ఎస్‌లో హరీశ్, కేటీఆర్‌కు పడటం లేదని అన్నారు. ఎమ్మెల్సీ కవిత మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వార్తలు రావడంతో ఆ జిల్లా నేతలు, ఎమ్మేల్యేలు అప్రమత్తమవుతున్నారని చెప్పారు. హరీశ్ రావు ప్రోద్బలం లేకుండా ఆ నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలిసే అవకాశం లేదని అన్నారు. ప్రజలు తిరస్కరించిన తరువాత కూడా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రావడం లేదని రఘునందన్ రావు చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే అది వృథా అయిపోయినట్లేనని చెప్పారు. 2009లో కేసీఆర్ అధ్యక్ష పీఠాన్ని లాక్కోవడానికి జరిగిన కొట్లాట మళ్లీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతోందని ఆరోపించారు. ఆ పార్టీ అధ్యాయం మొన్నటి ఎన్నికలతో ముగిసిందని తెలిపారు.