BRS MLAs: కేసీఆర్ వెంటే ఉంటాం.. సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి?

ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని, కేసీఆరే తమ నాయకుడని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు.

BRS MLAs: కేసీఆర్ వెంటే ఉంటాం.. సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి?

brs mlas clarification on meet cm revanth reddy

BRS MLAs: తాము కేసీఆర్ వెంటే ఉంటామని, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరతామని వచ్చిన వార్తలను ఖండించారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తాము సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై అనవసరంగా రాజకీయం చేస్తున్నారని, ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని కోరేందుకే కలిసినట్టు చెప్పారు. ప్రోటోకాల్, వ్యక్తిగత సెక్యురిటీ గురించి కూడా సీఎంతో చర్చించినట్టు తెలిపారు. రాజకీయ దురుద్దేశం గానీ, పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

తమ పార్టీ అధిష్టానంపై తమకు నమ్మకం ఉందని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్టు చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తలతో తమ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారని, ఈ అంశానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారు. తమ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు అయినా ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు. ”ఇంకా వందసార్లు కలుస్తాం, నెలకు ఒక్కసారైనా కలుస్తాం. మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎక్కడికైనా పోతాం, ఎవరినైనా కలుస్తామ”ని ప్రకటించారు.

కేసీఆరే మా నాయకుడు
రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలిశారని.. అదేవిధంగా తాము కూడా నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రిని కలిశామన్నారు. ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంత్రులను, అధికారులను కలుస్తుంటామని.. ఇదో నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని, కేసీఆరే తమ నాయకుడని స్పష్టం చేశారు. పార్టీ మారాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే పరువునష్టం వేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

Also Read: మరోసారి కేసీఆర్ కరీంనగర్‌ సెంటిమెంట్‌..! త్వరలో అక్కడ మకాం..!