మరోసారి కేసీఆర్ కరీంనగర్‌ సెంటిమెంట్‌..! త్వరలో అక్కడ మకాం..!

తొలిసారి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కరీంనగర్‌ లోక్‌సభను ఎంచుకుని.. 2004లో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ కోసం రెండు సార్లు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లి.. కరీంనగర్ నుంచే గెలుపొందారు.

మరోసారి కేసీఆర్ కరీంనగర్‌ సెంటిమెంట్‌..! త్వరలో అక్కడ మకాం..!

KCR To Follow Political Sentiment

KCR : గులాబీ బాస్‌ కరీంనగర్‌లో మకాం వేయబోతున్నారా? అక్కడి నుంచే పార్లమెంట్‌ ఎన్నికలకు వ్యూహరచన చేస్తారా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన కరీంనగర్ జిల్లా నుంచే పార్లమెంట్‌ ఎన్నికల వ్యూహరచన చేయనున్నారని పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ బాస్‌… మరోసారి కరీంనగర్‌ సెంటిమెంట్‌ను ఫాలో అవబోతున్నట్లు తెలుస్తోంది.

ఉద్యమం సమయం నుంచి కరీంనగర్ సెంటిమెంట్..
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌కు కరీంనగర్ ఓ సెంటిమెంట్‌గా ఉంది. ఉద్యమ కాలం నుంచి, పార్టీ తరపున ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఉమ్మడి కరీంనగర్ నుంచే మొదలు పెట్టేవారు. కరీంనగర్‌ సెంటిమెంట్‌ గురించి గతంలో పలు సభల్లో సైతం కేసీఆర్‌ ప్రస్తావించారు. ప్రస్తుతం కోలుకుంటున్న కేసీఆర్.. తన మకాంను కరీంనగర్‌కు మారుస్తుండటంతో.. ఉత్తర తెలంగాణ భవన్‌గా పిలవబడే కేసీఆర్ నివాసంలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు.

Also Read : రూ.3,200 కోట్లు వృథా.. మేడిగడ్డ వెనుక భారీ స్కాం.. విచారణలో మరిన్ని సంచలన విషయాలు

వైఎస్ఆర్ ఎన్నో వ్యూహాలు చేసినా.. కేసీఆర్ విజయం
కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ప్రత్యేక తెలంగాణ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కరీంనగర్‌ లోక్‌సభ నుంచి పోటీ చేశారు. ఆయన తొలిసారి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కరీంనగర్‌ లోక్‌సభను ఎంచుకుని.. 2004లో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ కోసం రెండు సార్లు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లి.. కరీంనగర్ నుంచే గెలుపొందారు. 2008 ఉప ఎన్నికలో కేసీఆర్‌ను ఓడించడానికి అప్పటి సీఎం వైఎస్ఆర్ ఎన్నో వ్యూహాలు చేసినప్పటికి.. కేసీఆర్ విజయం సాధించారు. తెలంగాణ సాధించిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎంపీగా గెలుపొందారు. ఇలా దశాబ్దకాలం పాటు కరీంనగర్ గులాబీ పార్టీకి అడ్డాగా మారిపోవడంతో కేసీఆర్‌కు సెంటిమెంట్‌గా మారిపోయింది.

Also Read : తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మ‌రో శుభ‌వార్త‌.. వ‌చ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమ‌లు

పార్లమెంట్ సెగ్మెంట్లు అన్నీ కరీంనగర్ సరౌండింగ్‌లోనే..
తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత.. ఆ పార్టీ నేతలు ఓటమిపై అంతర్గత చర్చలు మొదలు పెట్టారు. ఓటమి కారణాలను అన్వేషిస్తూనే.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. కరీంనగర్‌తో పాటు పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లు అన్నీ కరీంనగర్ సరౌండింగ్‌లో ఉండడంతో.. ఇక్కడి నుంచే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు వీలుగా ఉంటుందని భావించిన కేసీఆర్.. కొంత కాలం పాటు కరీంనగర్‌లో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది.

జాతీయ స్థాయిలో బలంగా నిలబడాలనే భావన..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి దూకుడు మీదున్న కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవాలని ప్లాన్ చేస్తోంది. మరోవైపు గత పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందుకున్న బీజేపీ మరోసారి మోదీ చరిష్మాతో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు రంగంలోకి దిగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు ప్రచారాన్ని షురూ చేశారు.

అయితే కాంగ్రెస్, బీజేపీ టార్గెట్‌గా బీఆర్ఎస్ బలమైన అభ్యర్థులను బరిలో నిలిపి.. జాతీయ స్థాయిలో బలంగా నిలబడాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కేసీఆర్ కరీంనగర్‌లో కొన్ని రోజుల పాటు మకాం వేసి.. పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేయబోతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ క్యాడర్‌తో సమావేశాలు నిర్వహించి శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంమ్మీద కేసీఆర్ కరీంనగర్‌కు మకాం మారుస్తుండటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.