ఈ సారి ఎన్నికల బరిలో షర్మిల ఉంటారా.. వైసీపీలో ఏం జరగబోతోంది.
అమరావతి : పాత బాణానికి జగనన్న మళ్లీ పదును పెడుతున్నారా..? కష్ట కాలంలో పార్టీని నిలమెట్టిన ఆ బాణం.. మరోసారి పార్టీలో కీలక పాత్ర పోషించబోతుందా అంటే .. అవుననే సమాధానం వస్తోంది. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గత ఎన్నికల ముందుకొచ్చిన షర్మిల మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాబోతున్నారని సమాచారం. అయితే పార్టీలో షర్మిల పాత్ర ఏవిధంగా ఉండబోతుంది.. ఈ సారి ఎన్నికల బరిలో షర్మిల ఉంటారా.. వైసీపీలో ఏం జరగబోతోంది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో పార్టీలు వచ్చిన అన్ని అవకాశాలనూ వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ అధినేత పాత బాణాన్ని మరో సారి పదును పెడుతున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. నేను జగనన్న వదిలిన బాణాన్నంటూ గత ఎన్నికల ముందు చురుగ్గా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్న షర్మిల.. మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. అంతే కాదు.. షర్మిలకు పార్టీలో కీలక బాద్యతలు ఇవ్వబోతున్నట్లు సమాచారం.
గత ఎన్నికలకు మందు 2012లో తన పాదయాత్రతో పార్టీని యాక్టివ్ చేశారు షర్మిల.. జగన్ జైల్‌లో ఉంటే షర్మిల తన పాదయాత్రతో కేడర్‌లో ఉత్సాహం నింపారు. అప్పటి షర్మిల పాదయాత్ర పార్టీకి పెద్ద ప్లెస్ అయ్యింది. అయితే పాదయాత్ర తర్వాత షర్మిల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కూడా ఎక్కడా పోటీ చెయ్యలేదు. ఇప్పుడు షర్మిల మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తున్నారంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. కీలక బాధ్యతలు కూడా ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో షర్మిలకు రాయలసీమ బాధ్యతలు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో సీమలో అనంతపురం మినహా మిగిలిన మూడు జిల్లాల్లో వైసీపీ మెజారిటీ సాధించింది. వచ్చే ఎన్నికల్లో అనంతపురంలోనూ మెజారిటీ రావాలని జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా షర్మిలకు సీమ ఇంచార్జ్ గా బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనేది ఆలోచిస్తున్నారు. సీమలో పార్టీ బలంగానే ఉంది కనుక షర్మిలకు బాధ్యతలు అప్పగించి తాను కోస్తాంధ్ర ప్రాంతంపై ఫుల్‌టైం ఫోకస్ పెట్టాలని చూస్తున్నారట.
ఇదిలా ఉంటే షర్మిలకు కేవలం సీమ బాధ్యతలే కాకుండా ఈ సారి ఎన్నికల బరిలోనూ దింపనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తల్లి విజయమ్మను విశాఖ ఎంపిగా పోటీ చెయ్యించినా ఓటమిపాలయ్యారు. అయితే ఈ సారి తాను ఎంపీ స్టానం నుంచి ఎన్నికల బరిలో దిగుతానని షర్మిల కోరినట్లు దానికి జగన్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేస్తుందనే దానిపైనా పార్టీలో చర్చ జరుగుతోంది. షర్మిల మాత్రం బాబాయి వై.వి సుబ్బారెడ్డి నియోజకర్గం ఒంగోలు నుంచి పోటీ చేసేందుకు అసక్తి చూపిస్తున్నారట. దీనికి సుబ్బారెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఒక వేళ ఒంగోలు కాకపోతే కడప నుంచి షర్మిల కోసం పరిశీలనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారంపై శ్రేణులు ఆసక్తి చూపుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా షర్మిల వస్తే పార్టీకి ప్లస్ అవుతుందంటున్నారు. కాని.. అవినాష్‌రెడ్డి తప్ప కుటుంబ సభ్యులెవరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదనేది జగన్ ఆలోచన అని మరికొందరు పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే షర్మిలను గత ఎన్నిల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ఆపేశారని సమాచారం. ఈసారి కూడా అందులో మార్పు ఉండబోదని వారు చెబుతున్నారు. అటు తన తల్లి విజయమ్మ కూడా ఈసారి పోటీలో ఉండరని జగన్ చెబుతున్నారట. పార్టీ, వ్యవహారాలు చూసుకున్నా.. ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఉండరని చెబుతున్నారట. గత ఎన్నికల్లో విజయమ్మ పోటీ వల్ల కేడర్ సగం మంది విశాఖలోనే ఉండాల్సి రావడంవల్ల నష్టమేగాని ఎటువంటి ఫలితం లేకుండా పోయిందనేది ఆయన ఆలోచన అని చెబుతున్నారు. సో.. షర్మిల ఎంట్రీపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.