Cm Revanth Reddy: నిజాం కంటే శ్రీమంతుడు అవుదామనుకున్నారు.. అందుకే అలా చేశారు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

వీళ్ల ప్రణాళికలకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అడ్డు చెబితే ఆ నివేదికను కనిపించకుండా మాయం చేశారు.

Cm Revanth Reddy: నిజాం కంటే శ్రీమంతుడు అవుదామనుకున్నారు.. అందుకే అలా చేశారు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

Updated On : August 31, 2025 / 7:44 PM IST

Cm Revanth Reddy: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై అసెంబ్లీలో హాట్ హాట్ గా డిస్కషన్ జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు.

ఆనాడు మంత్రిగా ఉన్న హరీశ్ రావు ఈనాటికీ మంత్రిగా ఉన్నట్టుగానే భావిస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. నీరు అందుబాటులో ఉందని చెప్పినా మళ్లీ పరిశీలించాలని లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ నిర్మించుకుంటామని వాదించకుండా.. పేరు మార్చి ఊరు మార్చి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.

2014లో నీరు అందుబాటులో ఉందని చెప్పిన విషయం దాచి 13 మార్చి 2015 న ఉమా భారతి లేఖను పట్టుకుని హరీశ్ రావు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ అన్నారు. విద్యాసాగర్ రావు బతికి ఉంటే వీళ్ల అబద్ధాలు వినలేక అదే కాళేశ్వరంలో దూకి ఆత్మహత్య చేసుకునే వారని వ్యాఖ్యానించారు.

”మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదు. ఎత్తు తగ్గించుకోవాలని మాత్రమే వాళ్లు సూచించారు. నిజాం కంటే ధనవంతుడు కావాలన్న దుర్బుద్ధితో కేసీఆర్ ప్రాజెక్ట్ రీడిజైన్ చేశారు. మేడిగడ్డ దగ్గర కట్టాలని కేసీఆర్, హరీశ్ ముందే నిర్ణయించుకున్నాక రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీని నియమించారు.

రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక వారికి అనుకూలంగా లేదని ఆ నివేదికను తొక్కి పెట్టి వాళ్లు అనుకున్న చోట ప్రాజెక్ట్ కట్టారు. వీళ్ల ఉద్దేశమే తుమ్మిడిహట్టిని మేడిగడ్డకు తరలించడం. వీళ్ల ప్రణాళికలకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అడ్డు చెబితే ఆ నివేదికను కనిపించకుండా మాయం చేశారు.

హరీశ్ చెప్పిన అబద్ధాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. 2009, 2014లో రెండుసార్లు తమ్మిడిహట్టిలో నీళ్లు ఉన్నాయని CWC చెబితే.. మళ్లీ నీళ్లు లేవని ఎందుకు ఎగ్జామ్ చేశారు. లక్ష కోట్ల కొల్లగొట్టడానికి కేసీఆర్ డిజైన్ మార్చారు. 148 మీటర్ల ఎత్తులో ప్రాణహిత నిర్మించుకోవాలి మహారాష్ట్ర అంది. 152 అడుగుల ఎత్తులో కట్టాలన్న దానిపై చర్చ జరిగింది.

నిజాం కంటే శ్రీమంతుడు కావాలనే దురాశ కేసీఆర్ కు కలిగింది. అందుకే డిజైన్ మార్చారు. కేసీఆర్, హరీశ్ మేడిగడ్డలో నిర్మించాలని డిసైడ్ అయ్యారు. ఎక్స్ పర్ట్స్ కమిటీ కూడా మేడిగడ్డ వద్ద నిర్మించవద్దని రిపోర్ట్ ఇచ్చింది. ఎక్స్ పర్ట్స్ కమిటీ రిపోర్ట్ ను హరీశ్, కేసీఆర్ తొక్కి పెట్టారని కమిషన్ తేల్చింది. మేడిగడ్డలో లిఫ్ట్ పెట్టాలి, బ్యారేజ్ కట్టాలి, లక్ష కోట్లు కొల్లగొట్టాలి అని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగమే.. కోర్టులో నిలబడదు.. కాళేశ్వరం రిపోర్ట్‌పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు