అదో చెత్త రిపోర్ట్.. కోర్టులో నిలబడదు.. రాజకీయ కుట్ర.. కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో హరీశ్ రావు

అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? సర్కస్ నడిపిస్తున్నారా? ప్రభుత్వం హడావుడిగా సభలో కాళేశ్వరం కమిషన్ నివేదిక పెట్టింది. (Harish Rao)

అదో చెత్త రిపోర్ట్.. కోర్టులో నిలబడదు.. రాజకీయ కుట్ర.. కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో హరీశ్ రావు

Updated On : August 31, 2025 / 7:53 PM IST

Harish Rao: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై అసెంబ్లీలో హాట్ హాట్ గా డిస్కషన్ జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగంగా పీసీ ఘోష్ కమిషన్ వేశారని హరీశ్ రావు ఆరోపించారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ చెత్త రిపోర్ట్ అన్న హరీశ్… పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కోర్టులో నిలబడదన్నారు.

”షా కమిషన్.. ఇందిరా గాంధీకి 8b కిందా నోటీసులు ఇచ్చి విచారణ చేసింది. ఇది రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగం అని కాంగ్రెస్ ఆరోపించింది. ఎల్ కే అద్వానీపై జస్టిస్ లిబర్హాన్ కమిషన్ విచారణ నివేదిక కూడా రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగం అని బీజేపీ ఆరోపించింది. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ కూడా రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగంగా మాపై కమిషన్ వేసింది.

కోర్టు కేసు గురించి మాట్లాడొద్దని మంత్రులు అంటున్నారు. మరి ఇందిరా గాంధీ ఎందుకు కోర్టుకు పోయారు? చరిత్రలో కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. మాకు మాట్లాడేందుకు మినిమం రెండు గంటల సమయం కావాలి. మాట్లాడతాం అంటే.. ఎందుకు భయపడుతున్నారు?

వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరంపై నాలుగు రోజుల అయినా మాట్లాడతా. మాపై ఇష్టం ఉన్నట్టు ఆరోపణలు చేస్తున్నారు. PPTకి సభ అనుమతి ఇవ్వలేదు. 650 పేజీల రిపోర్ట్ లో ఒక్కో పేజీకి ఒక్కో పదానికి సమాధానం ఇస్తాను.

ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? సర్కస్ నడిపిస్తున్నారా?

ప్రభుత్వం హడావుడిగా సభలో కాళేశ్వరం కమిషన్ నివేదిక పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ముందు మొదటి రిపోర్ట్, పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్ట్, సిల్వర్ జూబ్లీ వేడుకల ముందు ఫైనల్ రిపోర్ట్, స్థానిక సంస్థల ఎన్నికల ముందు కమిషన్ నివేదిక. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? సర్కస్ నడిపిస్తున్నారా?

8b కింద మాకు ఘోష్ కమిషన్ నోటీసులు ఇవ్వలేదు. క్రాస్ ఎగ్జామింగ్ కి సమయం ఇవ్వలేదు. కేసీఆర్ కు ఎక్కడ పేరు వస్తుందో అని కాంగ్రెస్ పార్టీ ముందు నుండి కాళేశ్వరంని అడ్డుకుంది, కేసులు వేసింది. కమిషన్ నివేదికను పొలిటికల్ వెపన్ గా వాడుకుంది. రిపోర్ట్ న్యాయ బద్దంగా లేదు. నిష్పక్షపాతంగా కమిషన్ విచారణ జరగలేదు.

ఇందిరా గాంధీపై వేసిన షా కమిషన్ నివేదికను కాంగ్రెస్ తప్పుబట్టింది. సుప్రీంకోర్టు జస్టిస్ షా కమిషన్ కు వ్యతిరేకంగా ఇదే కాంగ్రెస్ ధర్నాలు చేసింది. ఆరోజు షా కమిషన్ తప్పైంది, నేడు ఈ చెత్త కమిషన్ నివేదిక ఒప్పైంది.

రాష్ట్రంలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా దొరక్క రైతులు అల్లాడుతున్నారు. దాని మీద మాట్లాడదాం అంటే అది మాకు ఇంపార్టెంట్ కాదంటున్నారు. వరదలు, ఎరువులు తర్వాత.. బురద రాజకీయాల మీద మాట్లాడదాం అని పెట్టారు. ఓకే దీని మీదే మాట్లాడతా. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. రెండు రోజులైనా కమిషన్ నివేదికపై చర్చిద్దాం. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది” అని హరీశ్ రావు అన్నారు.