Cm Revanth Reddy: సిట్, సీఐడీ, సీబీఐ, ఈడీ.. నిజాయితీపరులైతే ఏ విచారణ కావాలో చెప్పాలి.. హరీశ్ కు సీఎం రేవంత్ సవాల్
మా మామ చెబితేనే నేను చేశానని హరీశ్ చెప్పారు. ఇవి బయటికి వస్తాయనే భయపడుతున్నారు.

Cm Revanth Reddy: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చర్చ అసెంబ్లీలో పొలిటికల్ హీట్ పెంచింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి హరీశ్ రావుకు సవాల్ విసిరారు. సిట్, సీఐడీ, సీబీఐ, ఈడీ.. నిజాయితీపరులైతే ఏ విచారణ కావాలో చెప్పాలి.. అంటూ హరీశ్ ను ఛాలెంజ్ చేశారు.
”తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని హరీశ్ చూస్తున్నారు. తుమ్మిడిహట్టిలో నీళ్లు ఉన్నాయని కేంద్రమంత్రి ఉమాభారతి లేఖ రాశారు. 205 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని లేఖ రాశారు. హరీశ్ ఆ లేఖను ఎండార్స్ చేశారు. 2009లో కూడా కేంద్రం తమ్మిడిహట్టిలో CWC లేఖ రాసింది నిజం. ఈ రికార్డులను తొక్కిపట్టి.. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చారు. తమ్మిడిహట్టిలో నీళ్లు లేవని తప్పుడు ప్రచారం చేశారు.
వ్యవస్థలను హరీశ్ తప్పు పట్టించారని పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. కమిషన్ వాస్తవాలు బయటపెట్టినందుకు.. హరీశ్ విషం చిమ్ముతున్నారు. నిజాయితీపరులైతే ఏ విచారణ కావాలో చెప్పాలి. సిట్ కావాలా? సీఐడీ, సీబీఐ, ఈడీ కావాలో హరీశ్ చెప్పాలి. ఆంధ్రోళ్లు చేస్తలేరనే కదా తెలంగాణ తెచ్చుకుంది. ఏనుగులను తినే వాడు వద్దంటే, పీనుగులను తినే వాడు వచ్చాడు.
నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది నిజమని కమిషన్ కు హరీశ్ చెప్పారు. మా మామ చెబితేనే నేను చేశానని హరీశ్ చెప్పారు. ఇవి బయటికి వస్తాయనే హరీశ్ భయం. తుమ్మిడిహట్టి దగ్గర ఇచ్చిన వార్నింగ్ క్లాజ్ ను మేడిగడ్డ విషయంలోనూ పేర్కొన్నారు. దీనికి శిక్షించాల్సి వస్తే వీళ్లని ఉరి తీయాలి కదా?
ఏ కారణంతో తుమ్మిడిహట్టి వద్ద ఇచ్చిన హెచ్చరికను కారణంగా చూపి ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారో.. మేడిగడ్డ విషయంలో అదే హెచ్చరిక ఉందని పీసీ ఘోష్ కమిషన్ పేజీ నెంబర్ 72 లో పేర్కొంది. అందుకే హరీశ్ రావు.. కమిషన్ నివేదికపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. హరీశ్ దయచేసి తప్పుడు ప్రచారాలు మానుకోవాలి” అని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
Also Read: నిజాం కంటే శ్రీమంతుడు అవుదామనుకున్నారు.. అందుకే అలా చేశారు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్