యాత్ర ఎఫెక్ట్ : సినీ ఇండస్ట్రీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ వల

  • Publish Date - February 21, 2019 / 01:33 PM IST

మూడే మూడు నెలలు.. 90 రోజులు.. పార్టీ గెలిచినా – ఓడినా ఈ మూడు నెలలే. అందుకే పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార టీడీపీకి పోటీగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా సినీ ఇండస్ట్రీకి వల వేస్తోంది. పార్టీకి గ్లామర్ అద్దాలని ప్రయత్నిస్తోంది. టీడీపీలోకి వెళ్లలేని వారిని తనవైపు తిప్పుకునేందుకు చర్చలు జరుపుతుంది. వారం, 10 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ క్రమంలోనే మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్‌, అవంతి శ్రీనివాసరావు, పండుల రవీంద్రబాబు.. టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. మరికొంత మంది నేతలు జగన్‌తో కలిసి నడిచేందుకు రెడీ అవుతున్నారు. మాజీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వైసీపీ గూటికి చేరుతున్నారు. వలస నేతలతో వైసీపీ హౌస్‌ఫుల్ అవుతోంది. ఇంత మంది వస్తున్నా ఓ లోటు మాత్రం ఉంది. అదే సినీ గ్లామర్. జగన్ ఒక్కరే ఫేస్ అయిపోయారు.. కొంచెం గ్లామర్ ఉంటే మరింత కిక్కు వస్తుందనే ఉద్దేశంతో.. ఆలస్యం చేయకుండా సినీ ఇండస్ట్రీకి వల వేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

వైసీపీకి నగరి ఎమ్మెల్యే రోజా, రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ తప్పా సినీ గ్లామర్‌ లేదు. పార్టీకి సినీ గ్లామర్ అద్ది.. ప్రచారంలోకి తారలను దించాలని జగన్‌ వ్యూహాలు రచిస్తున్నారు. కొందరిని ఎన్నికల్లో పోటీ చేయించేందుకు కసరత్తు కూడా చేస్తున్నారు. మొన్నటికి మొన్న అలీ జాయిన్ అవుతున్నారనే వార్తలు వచ్చినా.. ఫలితంలేదు. ఇటీవలే జగన్‌తో నాగార్జున భేటీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. పాదయాత్ర పూర్తి చేసిన జగన్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చానని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు కూడా లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిశారు. గుంటూరు నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు. నార్నే శ్రీనివాసరావుకు జగన్‌ ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. సినీ తారల్లోకి కొందరి టికెట్‌ ఇచ్చి.. పోటీ చేయించాలని భావిస్తున్న జగన్‌ ప్లాన్‌ ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

ఇటీవలే వచ్చిన యాత్ర మూవీ ఎఫెక్ట్ ఏమోగానీ.. సినీ తారలను తనవైపు తిప్పుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు సీనియర్ నేతలు. ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి..