Tirumala Tirupati : భక్తులకు టీటీడీ షాక్, విగ్రహాలు అరుగుతున్నాయని…

abhishekam : భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. శ్రీవారి సేవలో తరించాలనే భక్తులకు చేదు వార్తను చెప్పింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను కాపాడుకునేందుకు.. కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. నిత్యాభిషేకాలను రద్దు చేసింది. ఇకనుంచి సేవలను కేవలం ఏడాదికి ఒక్కోసారే నిర్వహించనుంది.

నిత్య అభిషేకాలతో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ఉత్సవ మూర్తి మలయప్ప స్వామి, ఆయన దేవేరులైన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు అరుగుదలకు లోనవుతున్నాయి. దీంతో ఉత్సవ మూర్తుల విగ్రహాలు క్షయానికి గురికాకుండా కాపాడేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. అభిషేకాలను తగ్గించాలని నిర్ణయించింది. ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజతో పాటు బుధవారం చేసే సహస్ర కలశాభిషేకం, నిత్యం నిర్వహించే ఆర్జిత వసంతోత్సవ సేవలను ఇకపై ఏడాదికి ఒక్కసారే నిర్వహించనున్నారు. తద్వారా మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాల అరుగుదలను నిరోధించవచ్చని భావిస్తున్నారు.

ఉత్సవమూర్తులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని టీటీడీ ప్రధాన అర్చకులు, ఆగమ సలహామండలి సభ్యులు, పెద్ద జీయంగారు తదితరులు అధికారులకు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలపై ఇటీవల ధర్మకర్తల మండలిలో చర్చించి సూచనలకు ఆమోదముద్ర వేశారు. దాంతో ఇకనుంచి సేవలను కేవలం ఏడాదికి ఒక్కసారే నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు