Apara Ekadashi 2026 : అపార పుణ్యం ప్రసాదించే అపర ఏకాదశి.. తేదీ, పూజా సమయం.. తులసి పూజలో ఈ పొరపాట్లు చేస్తే మహా పాపం..!
Apara Ekadashi 2026 : వైశాఖ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. మరి ఈ సంవత్సరం ఈ పర్వదినం ఎప్పుడు వస్తుంది.. పాటించాల్సిన నియమాలు ఏంటి అనే వివరాలు..
apara ekadashi 2026 on may 12 or 13 know the correct date puja muhurat fasting rules dos and donts
Apara Ekadashi 2026 : హిందూ సంప్రదాయం ప్రకారం.. 15 తిథుల్లో ఏకాదశిని అత్యంత పవిత్రమైన తిథిగా భావిస్తారు. అలాగే ఏకాదశి నాడు ప్రత్యేకంగా వ్రతం ఆచరిస్తారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో వైశాఖ మాస కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని ‘అపర ఏకాదశి’ లేదా ‘అచల ఏకాదశి’ అని పిలుస్తారు. ‘అపర’ అంటేనే అపారమైనది అని అర్థం. ఈ రోజున భక్తితో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అంతులేని పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. 2026లో ఈ పర్వదినం మే 12న వచ్చిందా లేదా 13న వచ్చిందా అనే దానిపై చిన్న సందేహం ఉంది. అయితే, అపర ఏకాదశి విశిష్టత మరియు ఈ రోజున తులసి పూజలో పాటించాల్సిన కఠిన నియమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
- తిథి ప్రారంభం: మే 12, 2026 – రాత్రి 09:56 సమయం ప్రారంభమవుతుంది.
- వ్రత ప్రారంభం: మే 13, 2026 (బుధవారం) (ఉదయ తిథి ఆధారంగా నిర్ణయం).
- ఉపవాస విరమణ: మే 14, ఉదయం 06:00 – 07:41 గంటల మధ్య.
- ద్వాదశి తిథి ముగింపు: మే 14, ఉదయం 07:41 గంటలకు.
అపర ఏకాదశి పూజా విధానం
- ఏకాదశి నాడు బ్రహ్మముహూర్తాన లేచి తలస్నానం చేయాలి.
- స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకుంటే మరీ మంచిది.
- పూజ గదిలో దీపం వెలిగించి ఉపవాస దీక్ష సంకల్పం తీసుకోవాలి.
శ్రీమహావిష్ణు పూజ
- “ఓం లక్ష్మీ నారాయణాయ నమః” మంత్రంతో అభిషేకం చేయాలి.
- పాలు, పంచామృతం, శుద్ధ జలాన్ని శ్రీమహావిష్ణువుకు సమర్పించాలి.
- చందనం, కుంకుమ, పసుపు, పూలు, తులసి దళాలతో స్వామి చిత్రపటాన్ని అలంకరించాలి.
నైవేద్యం
- పండ్లు, తీయని పదార్థాలను ప్రసాదంగా సమర్పించాలి.
- హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరితో పంచుకోవాలి.
తులసి పూజ – పాటించాల్సిన నియమాలు
శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి. ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించే భక్తులు తులసిని కూడా భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఈ రోజు తులసి పూజ సందర్భంగా కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఒకవేళ పొరపాటున చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది అని పండితులు హెచ్చరిస్తున్నారు.
నీరు పోయకూడదు:
ప్రతిరోజూ తులసి కోటకు నీరు పోయడం శుభప్రదం. కానీ, ఏకాదశి నాడు తులసి మొక్కకు నీరు పోయకూడదు. పురాణాల ప్రకారం, ఏకాదశి రోజున తులసి మాత కూడా తన ప్రాణనాథుడైన విష్ణుమూర్తి కోసం ‘నిర్జల ఉపవాసం’ (నీరు కూడా తాగకుండా చేసే వ్రతం) ఉంటుందని పండితులు చెబుతున్నారు. కనుక ఆమె వ్రతానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఈ రోజున నీరు పోయకూడదు.
తులసి దళాలను కోయవద్దు:
ఏకాదశి నాడు తులసి ఆకులను కోయడాన్ని మహా పాపంగా పరిగణిస్తారు. అందుకే పూజకు లేదా నైవేద్యానికి తులసి దళాలు కావాలనుకుంటే, ఒక రోజు ముందే అంటే ‘దశమి’ నాడే కోసి భద్రపరుచుకోవాలి. అంతేకాకుండా ఏకాదశి నాడు తులసిని కోయడమే కాకుండా అనవసరంగా తాకడం కూడా దోషమే అంటున్నారు పండితులు.
సాయంకాల దీపారాధన:
ఏకాదశి రోజున సాయంత్రం తులసి కోట వద్ద నెయ్యితో దీపం వెలిగించి, మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కానీ, పొరపాటున కూడా మొక్కను తాకకుండా కేవలం నమస్కరించాలి.
అపర ఏకాదశి పుణ్యఫలం
ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణు సహస్రనామ పారాయణం చేసేవారికి బ్రహ్మహత్యా పాతకం వంటి దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఈ అపర ఏకాదశి వ్రతాన్ని నిష్టతో ఆచరిస్తే అంతటి ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
చేయాల్సిన ముఖ్య పనులు
- జాగరణ: రాత్రి నిద్ర లేకుండా జాగారం చేస్తూ.. విష్ణు సహస్రనామం, భజనలు, మంత్రజపం చేయాలి.
- దానం: అన్నదానం లేదా వస్త్రదానం చేయడం శ్రేయస్కరం.
- భగవన్నామ స్మరణతో రోజంతా గడపడం ఉత్తమం.
చేయకూడని పనులు
- బియ్యం పదార్థాలు పూర్తిగా మానాలి.
- తులసి కోయకూడదు.
- జుట్టు కత్తిరించడం, గోర్లు తీయడం వంటి పనులు చేయకూడదు.
- కోపం, అసూయ, దూషణలు మానుకోవాలి.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తిమేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv నిర్థారించడం లేదు.
