APSRTC to run 3,777 special buses for Maha Shivaratri in Andhra Pradesh : మహాశివరాత్రి పర్వదినానికి ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలోని 98 శైవక్షేత్రాలకు మొత్తం 3,777 ప్రత్యేక బస్సుల్ని నడుపుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సాధారణ చార్జీలనే వసూలు చేయాలన్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు సాధారణ టికెట్ రేట్లనే ఈ పండక్కి వసూలు చేయనున్నారు. మహాశివరాత్రికి రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది భక్తులు ఆర్టీసీ సేవల్ని వినియోగించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట వద్దనున్న కోటప్పకొండకు 856 బస్సుల్ని, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, మహానంది, అహోబిలంలకు 938 బస్సుల్ని నడుపుతారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సుల్ని నడిపేందుకు ఇప్పటికే ఆర్టీసీ ఎండీ ఠాకూర్ అన్ని రీజియన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
బస్సులో ప్రయాణించేవారు మాస్క్ తప్పని సరిగా ధరించాలని ఆయన సూచించారు. బస్సుల ఏర్పాటు పై కోటప్పకొండలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. మాస్క్ లేనిదే బస్సుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని, ప్రతి క్యాంప్‌లో శానిటైజర్ల స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మొబైల్ టీంలు ఏర్పాటు చేయాలన్నారు.