Ayodhya Ram Mandir devotees Ram Lalla darshan and other details
Ayodhya Ram Mandir: దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన భరత ఖండంపై 2023కు ముందు.. 2024కు తర్వాత అని గర్వంగా ఎలుగెత్తి చాటే సందర్భమిది. పరమపావన మూర్తి శ్రీరామ చంద్రుడి అద్భుత ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కొత్త ఏడాదిలో శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆ నరోత్తముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. గర్భగుడిలో పాలరాతితో చేసి బంగారు పూత పూసిన 8 అడుగుల సింహాసనంపై కొలువుదీరనున్నాడు ఆ జగదభి రాముడు.
శ్రీరాముడి పాలనలో ధర్మం నాలుగు పాదాలపై నడిచిందని చెబుతుంటారు. అంతటి మహనీయుడి దివ్యమైన ఆలయ నిర్మాణం ఆయన జన్మస్థలమైన అయోధ్యలో రూపుదిద్దుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన శైలితో.. చిరకాలం పరిఢవిల్లేలా ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫైజాబాద్ జిల్లాలోని అయోధ్యలో నిర్మితమైందీ ఆలయం.
జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ
అయోధ్య శ్రీరాముడి మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 22న గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. గర్భగుడిలో పాలరాతితో నిర్మించి బంగారు పూత పూయించిన సింహాసనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 8 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు ఉన్న ఈ సింహాసనంపై రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు.
శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపనకు వారం రోజుల ముందు నుంచే వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి. జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుంది. ఆరోజున మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తారు. అనంతరం గర్భగుడి వద్ద శ్రీరామ పట్టాభిషేకం జరుపుతారు. ఆ తర్వాత 48 రోజులపాటు ఆలయంలో మండల పూజలు నిర్వహిస్తారు.
జోథ్‌పూర్ నుంచి 108 రథాలలో దేశీ నెయ్యి
రామయ్య ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇచ్చే మొదటి హారతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జోథ్‌పూర్ నుంచి 108 రథాలలో దేశీ నెయ్యిని అయోధ్యకు తీసుకువచ్చారు. దాదాపు 6 క్వింటాళ్ల నెయ్యితో పాటు హవన సామగ్రిని రథాలలో తీసుకువచ్చారు. ఈ నెయ్యితోనే రామయ్యకు తొలి హారతి ఇస్తారు.
Also Read: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆరు వందేభారత్ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ మహత్కార్యానికి శంకరాచార్యులందరితో పాటు మహా మండలేశ్వరులు, సిక్కు, బౌద్ధ ఆధ్యాత్మిక గురువులు, దాదాపు 4 వేల మంది సాధువులు హాజరుకానున్నారు. ప్రధాని మోదీతోపాటు వివిధ రంగాలకు చెందిన 2 వేల 500 మంది ప్రముఖులు తరలిరానున్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులు రామయ్యను దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.