Chandra Grahanam : ఇవాళే చంద్రగ్రహణం.. తస్మాత్ జాగ్రత్త..! ఈ పనులు అస్సులు చేయొద్దు.. ఏపీ, తెలంగాణలో ఈ ఆలయాలు మూసివేత..

Chandra Grahanam : ఆదివారం రాత్రి 9.58గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. సోమవారం తెల్లవారుజామున 1.26 గంటలకు ముగుస్తుంది.

Chandra Grahanam : ఇవాళే చంద్రగ్రహణం.. తస్మాత్ జాగ్రత్త..! ఈ పనులు అస్సులు చేయొద్దు.. ఏపీ, తెలంగాణలో ఈ ఆలయాలు మూసివేత..

Lunar Eclipse

Updated On : September 7, 2025 / 11:20 AM IST

Chandra Grahanam : ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఆదివారం రాత్రి 9.58గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. సోమవారం ఉదయం 1.26 గంటలకు ముగుస్తుంది. గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు 3గంటల 28 నిమిషాలు ఉంటుంది. అయితే, శాస్త్రాల ప్రకారం.. చంద్రగ్రహణం సూతకాలం గ్రహణానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది. అంటే.. ఆదివారం మధ్యాహ్నం 12.57గంటలకు సూతకాలం షురూ అవుతుంది. అంటే.. అప్పటి నుంచి గ్రహణ నియమాలను ఆచరించాలని చెబుతుంటారు. ఇది చంద్రగ్రహణం ముగిసే వరకు ఉంటుంది.

Also Read : Lunar Eclipse : మరికొన్ని గంటల్లో సంపూర్ణ చంద్రగ్రహణం.. హైదరాబాద్‌లో ఈ గ్రహణం కనిపిస్తుందా..? ఎన్ని గంటలు ఉంటుంది..?

2022 సంవత్సరం తరువాత మళ్లీ ఇప్పుడు సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో కనువిందు చేయనుంది. మళ్లీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం 2028 డిసెంబర్ 31వ తేదీన సంభవిస్తుందట. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో పూర్తిగా చీకటి కమ్ముకుంటుంది.

చంద్రగ్రహణం సమయంలో.. ముఖ్యంగా సూతక కాలంలో (గ్రహణానికి ముందు, తరువాత) గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకపోవటం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు వెళ్లొద్దని చెబతారు. గ్రహణం సమయంలో చంద్రుడిని చూడటం వల్ల కడుపులోని బిడ్డకు హానికరమని నమ్ముతారు.

గ్రహణం సమయంలో పూజలు చేయొద్దు. ఆర్థిక, భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. గ్రహణం సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంట్లోని అన్ని వస్తువులపై దుర్భలను లేదా తుసి దళాలను వేసుకుంటే మంచిది.

గ్రహణం సమయంలో దైవ నామస్మరణ, ధ్యానం చేయడం చాలా మంచిది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. గ్రహణానికి ముందు, తరువాత తప్పనిసరిగా తలస్నానం చేయాలి. గ్రహణానికి ముందు పట్టు స్నానం, గ్రహణానికి తరువాత విడుపు స్నానం అంటారు. ఇది గ్రహణ దోషాలు తొలిస్తాయని నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం.. ప్రతిఒక్కరి జాతకంలో గ్రహ స్థానాలను బట్టి ఫలితాలు మారవచ్చు.

Also Read: Chandra Grahan 2025 : చంద్రగ్రహణం ఎప్పుడు ముగుస్తుంది.. గ్రహణం తరువాత పాటించాల్సిన నియమాలు ఇవే.. నిర్లక్ష్యం చేయొద్దు..

ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు మూసివేయనున్నారు. గ్రహణం నేపథ్యంలో సుమారు 12గంటలపాటు భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు మూసివేయనున్నారు. సెప్టెంబర్7వ తేదీ (ఆదివారం) సాయంత్రం 3.30 గంటల నుంచి 8వ తేదీ (సోమవారం) తెల్లవారు జామున 3గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేసి ఉంటుంది. సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం కారణంగా తిరుమలలో ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు కూడా టీటీడీ రద్దు చేసింది. తిరిగి స్వామివారి దర్శనం సోమవారం ఉదయం 6గంటల నుంచి ప్రారంభమవుతుంది.

సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. ఆ తరువాత గుడిని మూసివేస్తారు. సోమవారం తెల్లవారు జామున 3.30గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేస్తారు. స్వామివారికి సుప్రభాతం, తిరువారాధన, బాలబోగం, నిజాభిషేకం, సహస్రనామార్చన నిర్వహించి సోమంవారం ఉదయం 8.15 గంటల నుంచి దర్శనాలు ప్రారంభిస్తారు.

సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో తెలంగాణలోని యాదగిరిగుట్టతోపాటు భద్రాచలం, వేములవాడ, వరంగల్ భద్రకాళీ ఆలయం, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలు సహా పలు పుణ్యక్షేత్రాలు మూతపడనున్నాయి.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, పర్ణశాల రామాలయం తలుపులను ఆదివారం మధ్యాహ్నం 1గంటకు మూసివేస్తారు. మళ్లీ సోమవారం ఉదయం 7.30గంటలకు దర్శనాలు ప్రారంభిస్తారు.
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు పెంబట్లలోని దుబ్బ రాజేశ్వర స్వామి, బీర్‌పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను మధ్యాహ్నం 1గంటకు మూసివేస్తారు. సోమవారం ఉదయం 5గంటలకు ఆలయాలను తెరిచి సంప్రోక్షణ, గ్రహణశాంతి హోమం, అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం సోమవారం ఉదయం 9.30గంటల నుంచి భక్తులకు దర్శనం అనుమతి కల్పిస్తారు.
తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయాన్ని ఆదివారం ఉదయం 11.30గంటలకు మూసివేస్తారు. సోమవారం ఉదయం 3.45 గంటలకు సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరిచి, ప్రాత:కాల పూజ అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.