తిరుమలలోని శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
చిత్తూరు : తిరుమలలోని శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న గేట్లను తొలగించి…నాలుగున్నర కోట్ల రూపాయల వ్యయంతో కొత్త గేట్లను ఏర్పాటు చేస్తోంది. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా…జాగ్రత్తలు తీసుకుంది టీటీడీ.
తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఇన్నీ కావు. స్వామివారు కొలువై ఉన్న తిరుమలలో భక్తులకే తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరంగా ఉన్న పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత స్వామి వారిని దర్శించుకోవాలనే నిబంధన ఉంది. వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం అయిన తిరుమలకొండ మీదకు వేంకటేశ్వరుడు దిగివచ్చే వేళ…జలక్రీడల కోసం, వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమిదేనని భక్తుల్లో నమ్ముతారు. సకల పాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. తారకాసురుని వధించి బ్రహ్మ హత్యాదోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానంచేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు చెబుతారు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి, భూదేవికి వివరించినట్లు వరాహా పురాణం చెబుతోంది. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు, ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
శ్రీవారి ఆలయం పుష్కరిణికి ఇంతటి విశిష్టత ఉండటంతోనే… ఇత్తడి గ్రిల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నాలుగున్నర కోట్ల చేపట్టిన పనులు…భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంజినీరింగ్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తూర్పు మాడ వీధిలో ఈ పనులు జరుగుతున్నాయి, ఇప్పటివరకూ ఉన్న గేట్లను తొలగించారు. నూతన గేట్ల ఏర్పాటుకు అనుగుణంగా రాతి నిర్మాణాల తొలగింపు పనులు చేపట్టారు. మార్చిలో జరుగనున్న శ్రీవారి తెప్పోత్సవాలలోపు తూర్పు మాడ వీధిలో 440 అడుగుల మేర ఇత్తడి గేట్లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం పుష్కరిణి చుట్టూ 6 అడుగుల ఎత్తులో నాలుగు వైపులా కలిపి 1,260 అడుగుల మేర ఇత్తడి గేట్లను ఏర్పాటు చేయనున్నారు.
తిరుమల శ్రీవారి పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలున్నాయి. ఇక్కడ మూడు మునకలేస్తే దీర్ఘాయుష్షు అని భక్తులకు నమ్మకం. స్వామి వారి ఆలయానికి కుడివైపున ఉన్న పుష్కరిణికి ఏళ్ల చరిత్ర ఉంది. ప్రతి ఏటా స్వామివారి తెప్పోత్సవాలు… ఈ పుష్కరిణిలోనే జరుగుతాయి. ఐదు రోజులపాటు జరిగే తెప్పోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటారు. అలాంటి పుష్కరిణిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన 9తీర్థాలు కూడా ఉన్నాయి. శ్రీవారి పుష్కరిణిలో కుబేర తీర్థం, గాలవతీర్థం, మార్కండేయ తీర్థం, అగ్నితీర్థం, యమతీర్థం, వశిష్ట తీర్థం, వరుణ తీర్థం, వాయు తీర్థం, సరస్వతి తీర్థం ఇలా మొత్తం ఏడు తీర్థాలున్నాయి. ఈ తొమ్మిది తీర్థాలలో ఒకే రోజు స్నానం చేసిన తర్వాత శ్రీనివాస భగవానున్ని దర్శనం చేసుకున్న మానవునికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి.
స్వామి వారి పుష్కరిణి స్నానం, శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం, విష్ణు సహస్ర నామ పారాయణం ఈ మూడు కార్యాలు అత్యంత ఉత్తమమైన తప ఫలాన్ని కలిగిస్తాయి. తొమ్మిది తీర్థాల నెలవుగా ఉన్న స్వామి పుష్కరిణిలో తప్పక స్నానం చేస్తుంటారు భక్తులు. ఆ తర్వాత అక్కడే ఉన్న శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుంటుంటారు. ఒకవేళ అలా చేయకపోతే ఆ క్షేత్రంలో ఎన్ని సేవలు చేసినప్పటికీ అవన్నీ నిష్ఫలాలే అవుతాయని పురాణాలు చెబుతున్నాయి.