ఆవు పేడతో గణేష్ విగ్రహాలు

కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి ఆవు పేడతో గణపతి ప్రతిమలను తయారు చేశాడు. వినాయక చవితి పండగను పర్యావరణానికి హాని జరగకుండా జరుపుకోవాలనుకున్నాడు.

  • Publish Date - August 29, 2019 / 08:08 AM IST

కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి ఆవు పేడతో గణపతి ప్రతిమలను తయారు చేశాడు. వినాయక చవితి పండగను పర్యావరణానికి హాని జరగకుండా జరుపుకోవాలనుకున్నాడు.

వినాయక చవితికి వాడవాడలా గణేశుడి విగ్రహాలు కొలువుదీరుతాయి. విభిన్న రూపాలతో ఉండే విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇందులో అధికశాతం ప్లాస్టర్ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారైతే… కొన్ని మాత్రం మట్టితో తయారుచేసినవి ఉంటాయి. కామారెడ్డి జిల్లాలో మాత్రం వీటన్నిటికి భిన్నంగా వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. పర్యావరణానికి ఏమాత్రం హాని కలగని రీతిలో గణపయ్యలను రూపొందిస్తున్నారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్… వినాయక చవితి పండగను పర్యావరణానికి హాని జరగకుండా జరుపుకోవాలనుకున్నాడు. ఇందుకోసం వినూత్న ఆలోచన చేశాడు. ఆవు పేడతో గణపతి ప్రతిమలను తయారు చేశాడు. 6 నెలల క్రితం న్యాయవాద వృత్తికి పుల్‌స్టాప్‌ పెట్టి బాన్సువాడలో గోశాలను ప్రారంభించిన శ్రీనివాస్… గోమయంతో వినాయక విగ్రహలను తయారు చేస్తున్నాడు. అతడొక్కడే కాదు… కుటుంబసభ్యులందరినీ ఈ విగ్రహాల  తయారీలోకి దింపాడు.

ఆవు పేడను ఆరబెట్టి పొడిగా చేసిన తర్వాత దానిని వినాయక ప్రతిమలుగా మలుస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకు 3వేలకుపైగా విగ్రహాలను ఆవు పేడతో తయారు చేశాడు శ్రీనివాస్. వాటిని వంద రూపాయల చొప్పున విక్రయిస్తున్నాడు. వినాయక ప్రతిమలే కాదు… వెంకటేశ్వరుడు, హనుమాన్ ప్రతిమలను సైతం ఆవుపేడతో తయారు చేశాడు. ప్రస్తుతం 12 అంగుళాల ఎత్తుతో ప్రతిమలను తయారుచేస్తుండగా… భవిష్యత్తులో వీటిని 6 అడుగులకు పెంచుతామని చెబుతున్నారు

ఆవు పేడతో విగ్రహాలే కాదు… టోపీ, మొబైల్ ఫోన్ స్టాండ్‌ లాంటి పలురకాల వస్తువులను కూడా తయారు చేస్తున్నారు. సెల్‌ఫోన్  ద్వారా వచ్చే రేడియేషన్‌ను తగ్గించే శక్తి కూడా ఆవు పేడకు ఉందని చెబుతున్నాడు. ఈ దిశగా తాము రీసెర్చ్ చేస్తున్నామని అంటున్నాడు. గోమయంతో ఆయుర్వేద ఔషధాలు కూడా తయారుచేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పాడు.