Ttd Chairman Yv Subba Reddy
Tirumala : తిరుమలలో ప్రైవేట్ సంస్ధల ఆధ్వర్యంలో నడిచే హోటళ్లు, రెస్టారెంట్లు యధావిధిగా నడుస్తాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. ఈరోజు ఆయన తిరుమలలో అన్నప్రసాద భవనం కమాండ్ కంట్రోల్ ను పరిశీలించారు. అనంతరం పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుమలలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని రెండు సంవత్సరాలు తర్వాత సాధారణ స్ధాయిలో సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తున్నామని ఆయన తెలిపారు. ఎంత మంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం అందించేలా చర్యలు తీసుకుంటున్నామనిసుబ్బారెడ్డి తెలిపారు.
ఉత్తర భారతదేశ భక్తుల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా అన్నప్రసాద భవనంలో చపాతీలు, రొట్టెలు వడ్డించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉత్తర భారతదేశ భక్తులకు మూడు పూటలా వారి సాంప్రదాయం ప్రకారం భోజనం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిరుమలలో అదనంగా మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు అందజేయాలని సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.
Also Read :Amaravathi: ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు..!
ఏప్రిల్ 1 నుండి శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జితసేవలు పునః ప్రారంభిస్తామని….శ్రీవారి ఆలయంలో ఎటువంటి ఆర్జిత సేవల ధరలు పెంచలేదని చైర్మన్ స్పష్టత ఇచ్చారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని మాత్రమే పాలకమండలి సమావేశంలో చర్చించామని ఆయన తెలిపారు.భక్తుల భద్రత కోసం తిరుమల ఘాట్ రోడ్ లలో కూడా త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం అని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.