Dharmashastra
Dharmashastra : స్త్రీ , పురుషులకు భారతీయ ధర్మ, నీతి శాస్త్రాలు సమాజంలో వారి నడతకు సంబంధించి ధర్మాలను బోధించాయి. పురుషాధిఖ్య సమాజం కాబట్టి కేవలం స్త్రీ అనుసరించ వలసిన ధర్మాల గురించే పదేపదే చెప్పటం జరుగుతుంది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ గా స్త్రీ నడుచుకోవాలని అనేక సందర్భాల్లో సూచిస్తూ ఉంటారు. అయితే అదే ధర్మ శాస్త్రం పురుషుడు సమాజంలో ఎలా నడుచుకోవాలి. భార్య పట్ల ఎలా ఉండాలన్న విషయాన్నిచాలా స్పష్టంగా చెప్పింది.
అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలియకపోవటమేమి కాదు పురుషాధిఖ్య సమాజంలో ఆ విషయాన్ని ఒక రకంగా మరుగునపడేశారనే చెప్పాలి. ధర్మ అర్ధ కామ్య మోక్షాలను సాధించటానికి జీవిత భాగస్వాములైన, స్త్రీ , పురుషులకు కొన్ని నిర్దేశిత సాంఘిక అనుసరణీయ ధర్మాలను భారతీయ ధర్మ, నీతి శాస్త్రాలు బోధించాయి. అయితే ప్రస్తుతం మనం పురుషులకు కోసం బోధించిన ధర్మాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్ధాం….
కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయా తు రామః భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః అంటూ పురుషుడు ఎలా ఉండాలో దర్మశాస్త్రంలో చక్కగా వివరించబడింది.
కార్యేషు యోగీ : పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
కరణేషు దక్షః కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
రూపేచ కృష్ణః రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.
క్షమయా తు రామః ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
భోజ్యేషు తృప్తః భార్య,తల్లి వండినదాన్ని సంతృప్తిగా వంకలు పెట్టకుండా భుజించాలి.
సుఖదుఃఖ మిత్రం షట్కర్మయుక్తః సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రునివలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
పై ఆరు విషయాలను తూచాతప్పకుండా పాటించే పురుషుడు సమాజంలో ఉత్తమ పురుషునిగా గుర్తింపు పొందుతాడని దర్మశాస్త్రం స్పష్టం చేసింది.