శ్రీశైలంలో కార్తీక మాసఉత్సవాలు

  • Publish Date - October 28, 2019 / 03:43 PM IST

ప్రముఖ శైవ క్షేత్రం  శ్రీశైలంలో అక్టోబరు 29 నుంచి కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఆలయ ఈవో రామారావు తెలిపారు. 2019వసంవత్సరం కార్తీక మాసంలో శ్రీశైలానికి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, రద్దీ రోజుల్లో సుప్రభాత సేవ, మహా మంగళ హారతి సేవల టికెట్లు నిలుపుదల చేస్తామని ఈవో  చెప్పారు.  భక్తులకు సేవలందించేందుకు సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయిస్తామన్నారు.  భక్తులకు సరిపడ ప్రసాదాలు తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి సంవత్సరం దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుండి  కార్తీక మాసం ప్రారంభమవుతుంది.ఈ మాసంలో శివ భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ అభిషేకాలతో శివుడ్ని పూజిస్తూ ఉంటారు. పురాణ కాలం నుండి ఈ మాసానికి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

ఈ రోజు నుండే కార్తీకస్నానాలు ప్రారంభం అవుతాయి. భక్తులు తెల్లవారు జామునే నిద్రలేచి ప్రవహించే నది,చెరువు,బావినీటితో స్నానం చేసి దైవదర్షణం చేసుకుంటే పుణ్యం,ఆరోగ్య సూత్రం అని ఎక్కువ మంది ఈ కార్తీక స్నానాలకు ప్రాధాన్యతను ఇస్తారు. హరి హరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్త కోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీశైలంలో కృష్ణానది ప్రవహిస్తుండటంతో భక్తులు నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు.  శ్రీశైలానికి  ఏపీ, తెలంగాణ నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.