Karthika Pournami
Karthika Pournami : కార్తీక మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఉన్న విశిష్టత చెప్పుకుంటే చాలా ఉంది. బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు నదుల వద్దకు వెళ్లి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో ఏపీ, తెలంగాణలో ఎక్కడ చూసినా ధ్యాత్మిక శోభ నెలకొంది.
కార్తీక పౌర్ణమి రోజున అందరూ సూర్యోదయానికి ముందే చన్నీళ్లతో లేదా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. ఒకవేళ సూర్యోదయానికి ముందు స్నానం చేయలేకపోయిన వారు కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసే సమయంలో గంగా, యమునా, సరస్వతీ అని మూడుమూడు సార్లు అనుకుంటూ స్నానం చేయాలి. ఆ స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది.
కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే మంచిది. అయితే, ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. శివాలయంలో ఏవైనా ప్రమిదల దీపాలు కొండెక్కిన తరువాత అందులోనే మళ్లీ దీపాన్ని వెలిగించడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు.
కార్తీక పౌర్ణమి రోజు తులసికోట దగ్గర ఉసిరిక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఉసిరికాయ పైన పెచ్చుతీసి ఆవు నెయ్యిలో తడిపిన ఒత్తి తీసి తులసి కోట దగ్గర వెలిగించాలి. అలాంటివి వీలైనన్ని వెలిగించాలి. బియ్యపు పిండితో చేసిన పిండి దీపాలు ఆవునెయ్యిని పోసి ఉసిరిక చెట్టు దగ్గర కానీ, తులసి కోట దగ్గర వెలిగించాలి. తులసికోటలో ఉసిరిక కొమ్మ ఉంచి ఉసిరిక దీపాలు కానీ, పిండి దీపాలు ఇంటి ఆవరణలో వెలిగించుకుంటే ఇంట్లో లక్ష్మీనారాయణలు ఆనందతాండవం చేస్తారు. పరమేశ్వరుడు పరామనందభరితుడై ఆనంద తాండవం చేస్తారు.
అలాగే సంవత్సరం మొత్తం దీపారాధనలు చేసిన ఫలితం రావాలంటే 365 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యిలో ముంచి వెలిగిస్తే మంచింది. కార్తీక పౌర్ణమి రోజు దేవాలయాల్లో జ్వాలా తోరణం దర్శనం చేసుకోవాలి. శివాలయాల్లో జ్వాలా తోరణం నిర్వహిస్తారు. గడ్డిని తోరణాలుగా ఏర్పాటు చేసి.. నువ్వుల నూనెలో ముంచిన వస్త్రాలు ఆ గడ్డికి చుట్టి నిప్పంటించి పార్వతీపరమేశ్వర విగ్రహాలు అటూఇటూ మూడుసార్లు తిప్పుతారు.. దీన్నే జ్వాలా తోరణం అంటారు. దీన్ని చూస్తే సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి. శత్రు బాధల నుంచి బయటపడొచ్చు. ఈ జ్వాలా తోరణం పూర్తయిన తరువాత ఆ గడ్డి కాలగా వచ్చిన బూడిదను బొట్టులా పెట్టుకుంటే సంవత్సరం మొత్తం ఎలాంటి దుష్టిదోషాలు ఉండవు, ఎటువంటి శత్రు బాధలు ఉండవు.. సమస్త సుఖాలు చేకూరుతాయని పండితులు పేర్కొంటున్నారు.