40వ వసంతంలోకి తిరుమల అన్నదాన సత్రం.. లక్షలాది మందికి భోజనం పెడుతున్న దీని ప్రత్యేకతలు ఇవే..

TTD: మొదట్లో నిత్యాన్నదాన వితరణ కేంద్రంలోనే భక్తులకు భోజనం పెట్టేవారు. ఆ తర్వాత..

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దేశంలో ఎన్నో ప్రముఖ దేవాలయాలున్నా తిరుమల క్షేత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల ఆకలిని తీరుస్తుంది స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణ కేంద్రం.

ఒకేసారి 4వేల మందికి భోజనం అందిస్తున్నారు. రోజుకు 50వేల మంది నుంచి లక్ష మంది వరకు భక్తులు అన్నదాన ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవాల వంటి రద్దీ రోజుల్లో అయితే రోజుకు లక్షమందికిపైగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది.

నిత్యం వేలాదిమంది భక్తుల ఆకలి తీర్చే..తిరుమల అన్నదాన సత్రం 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనం ఎంత భాగ్యమో..అన్నదాన సత్రంలో భోజనం చేయడం అంతే భాగ్యంగా భావిస్తుంటారు భక్తులు. స్వామివారి దర్శనం పూర్తిగానే బయటికి వస్తూనే తరికొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేస్తుంటారు.

ఆకలే అర్హతగా భక్తులకు ఎల్లవేళలా కడుపునిండా భోజనం వడ్డిస్తూ అందరి మన్ననలు పొందుతుంది తిరుమలలోని మాత్రుశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రం. ఇక్కడ అందించే భోజనాన్ని వెంకటేశ్వరస్వామి దివ్య ప్రసాదంగా భావిస్తారు భక్తులు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద వంటశాలను కలిగి నిత్యం వేలాదిమంది భక్తలకు ఆతిథ్యం ఇస్తోంది.

అప్పటినుంచి ఇప్పటివరకు దాతలు..

ఈ అన్నప్రసాద వితరణ కేంద్రంలో ప్రతిరోజు 12 టన్నుల బియ్యం అధునాతన స్టీం బాయిలర్లలో ఉడుకుతుంటాయి. మరోపక్క ఆరు టన్నుల కూరగాయలతో సాంబారు, కర్రీస్ లాంటివి..1250 మంది సిబ్బంది తయారుచేసి భక్తులకు వడ్డిస్తుంటారు. టీటీడీ నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వితరణ కేంద్రం 1985 ఏప్రిల్ 6న ప్రారంభమైంది.

ఆ రోజుల్లో యల్.వి.రామయ్య అనే భక్తుడు నిత్యాన్నదానం కోసం 5లక్షల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. అప్పటినుంచి ఇప్పటివరకు నిత్యం దాతలు సమర్పించిన మొత్తం విరాళాలు 17వందల కోట్ల రూపాయలకు చేరాయి. ఈ విరాళాలను వివిధ బ్యాంకుల్లో జమచేసి తద్వారా వచ్చే వడ్డీతో నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. ప్రతీనెలా నిత్యాన్నదానం నిర్వహణకు 105 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వడ్డీద్వారా వచ్చే అమౌంట్ సరిపోకపోతే మిగిలిన మొత్తాన్ని జనరల్ ఫండ్స్ ద్వారా టీటీడీ ఖర్చు పెడుతోంది

ప్రతిరోజు లక్ష నుంచి లక్షా 20వేల మందికి
మొదట్లో నిత్యాన్నదాన వితరణ కేంద్రంలోనే భక్తులకు భోజనం పెట్టేవారు. ఆ తర్వాత వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ క్యూలైన్లు, యాత్రికుల వసతి సముదాయాలు, మొదటి సత్రం, రాంబగీచా బస్టాండు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరించారు. ప్రతిరోజు లక్ష నుంచి లక్షా 20వేలమంది భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

దీంతో అన్నప్రసాద వితరణ కేంద్రం ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ.రామారావు సామాన్యభక్తుల కోసం తిరుమలలో అన్నదానం క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం 2వేల మంది భక్తులతో ప్రారంభమైన నిత్యాన్నదానం ఇప్పుడు నిత్యం లక్షమందికిపైగా భోజన సౌకర్యం కల్పిస్తోంది. పాత అన్నదానం సత్రం నుంచి నూతనంగా నిర్మించిన శ్రీతరిగొండ వెంగమాంబ సముదాయంలోకి మార్చినప్పటి నుంచి అన్నప్రసాద వితరణ కేంద్రంగా పేరు మార్చారు.

Also Read: ఇంద్ర‌కీలాద్రి పై ఈ నెల 9 నుంచి ఆధ్యాత్మిక ఉత్స‌వాలు

ట్రెండింగ్ వార్తలు