Indrakeeladri : ఇంద్రకీలాద్రి పై ఈ నెల 9 నుంచి ఆధ్యాత్మిక ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి పై ఈ నెల 9 నుంచి 27వ తేదీ వరకు ఆధ్యాత్మిక ఉత్సావాలు జరగనున్నాయి.

Spiritual festivals on Indrakiladri from 9th of this month
ఇంద్రకీలాద్రి పై ఈ నెల 9 నుంచి 27వ తేదీ వరకు ఆధ్యాత్మిక ఉత్సవాలను నిర్వహించనున్నట్లు దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు, వైదిక కమిటీ సభ్యులు శంకర్ శాండిల్య తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
ఉగాది వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 9 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చణలను నిర్వహించనున్నారు. ఆ తరువాత 19వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల చైత్రమాస బ్రహ్మోత్సవ కల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఈ నెల 9న ఉగాది సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతించనున్నట్లు తెలిపారు. మద్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం ఉండనుంది. అదే రోజు ఉదయం 8.15 నిముషాల నుంచి ప్రత్యేక పుష్పార్చణనలు ప్రారంభం కానున్నాయి.
ప్రత్యేక పుష్పార్చణనలు వివరాలు..
- 9న మల్లెపూలు, మరువముతో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు
- 10న కనకాంబరాలు, గులాబీలు
- 11న చామంతి, ఇతర పుష్పములు
- 12న మందార పుష్పములు, ఎర్ర కలువలు
- 13న తెల్లజిల్లేడు, మారేడు, తులసి, మరువము, ధవళము
- 14న కాగడా మల్లెలు, జూజులు, మరువము
- 15న ఎర్ర తామర పుష్పములు, ఎర్ర గన్నేరు, సన్నజాజులు
- 16న చామంతి, సంపంగి పుష్పములు
- 17న కనకాంబరాలు, గులాబీ
- 18న కనకాంబరాలు, వివిధ రకాల పుష్పములతో ప్రత్యేక పుష్పార్చణలు నిర్వహించనున్నారు.
ఈ నెల 19 నుంచి 27 వ తేదీ వరకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల చైత్రమాస బ్రహ్మోత్సవ కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. 22న రాత్రి 10.30 నిముషాలకు శ్రీ దుర్గా మల్లేశ్వర దివ్య కల్యాణమహోత్సవాన్ని నిర్వహించనున్నారు. 24న ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి, సాయంత్రం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లకు పవిత్ర క్రుష్ణానదిలో తెప్పోత్సవం జరగనుంది.