Krishna Janmashtami 2024
హిందూ ఇతిహాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు. ఆయన జన్మదినాన్ని కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అనే పేర్లతో జరుపుతుంటారు.
కృష్ణాష్టమిని భక్తిశ్రద్ధలతో జరుపుతారు. పగలంతా ఉపవాసం ఉన్న భక్తులు సాయంత్రం పూజలు చేస్తారు. స్వామికి ఎంతో ఇష్టమైన పళ్లు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, మీగడ నైవేద్యం పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ పాటలు, కీర్తనలు పాడతారు. ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఆగస్టు 26న నిర్వహిస్తున్నారు. 27న ఉట్ల పండుగ జరుపుతారు. అంటే ఆరోజు ఉట్టి కొడతారు. ఈ వేడుకలో యువత ఉత్సాహంగా పాల్గొంటారు.
ఉట్టి కొట్టే వేడుకను ఉత్తరాదిన ‘దహీ హండీ’ అని పిలుస్తారు. ఇంటింటికీ తిరుగుతూ మట్టికుండలో పెరుగు, పాలు, చిల్లర డబ్బులు సేకరించి వాటిని ఉట్టిలో పెట్టి దానికి పొడవైన తాడుని కడతారు. దానిని పైకి, కిందకు లాగుతూ ఉంటే యువకులు పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఉట్టి కొట్టేవారిపై వసంతం, నీళ్లు పోస్తూ ప్రోత్సహిస్తారు. ఇక ఉట్టికొట్టే ప్రాంతం అంతా సందడిగా మారిపోతుంది.
శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఎన్నో చిలిపి చేష్టలు చేసేవాడు. అందరి ఇళ్లలో పాలు, పెరుగు, వెన్న దొంగతనం చేసేవాడు. అతని ఆగడాల నుంచి తప్పించుకునేందుకు ఇళ్లలో వారు వాటిని కుండలో దాచిపెట్టి ఉట్టిలో పెట్టేవారు. కృష్ణుడు తన స్నేహితులతో వారి ఇళ్లకు వెళ్లి వారిని ఒకరిపై ఒకరిని ఎక్కమని వారి సాయంతో వాటిని దొంగతనం చేసేవాడు. కృష్ణుని చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటూ కృష్ణుడి జన్మదినం రోజు ఉట్టి పగలగొట్టి వేడుక జరుపుకుంటారు.
Also Read: హైదరాబాద్‌లో చెరువుల కబ్జా అనేది ఇప్పుడే మొదలైంది కాదు.. పూర్తి వివరాలు ఇదిగో