హైదరాబాద్‌లో చెరువుల కబ్జా అనేది ఇప్పుడే మొదలైంది కాదు.. పూర్తి వివరాలు ఇదిగో

ఇందులో 282 చెరువులు చూద్దామన్నా కనిపించవు. అవన్నీ ఇప్పుడు కాలనీలుగా మారిపోయాయి.

హైదరాబాద్‌లో చెరువుల కబ్జా అనేది ఇప్పుడే మొదలైంది కాదు.. పూర్తి వివరాలు ఇదిగో

మన భాగ్యనగరం… సువిశాల సరస్సులకు నిలయమని మీలో ఎందరికి తెలుసు..! సైబరాబాద్‌గా పిలిచే మన హైదరాబాద్‌… హైటెక్‌ సిటీగా మారకముందు లేక్‌ సిటీగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నగరమని ఎవరికైనా తెలుసా? నిజం… నిజాం కాలంలోనే అందమైన.. అత్యద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని హైదరాబాద్‌లో ఎన్నో చెరువులు నిర్మించారు.

నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్‌సాగర్‌తోపాటు… దశాబ్దాలుగా హైదరాబాదీల దాహర్తిని తీర్చిన జంట సాగరాలను వేలాది చెరువులను తవ్వించారు. ఈ సరస్సులను సంరక్షించి వారసత్వ సంపదగా భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యతను విస్మరిస్తూ చెరువులను చెరబడుతుండటమే నేటి దౌర్భాగ్యం…! అందుకే ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది… నగరంలోని సరస్సులకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

హైదరాబాద్ కోటిన్నర జనాభాను కడుపులో పెట్టుకున్న విశ్వ నగరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సగం కుటుంబాలకు ఆసరా మన హైదరాబాద్‌. తెలుగు రాష్ట్రాలే కాదు దేశం నలుమూలల నుంచి ఇక్కడి వచ్చి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న వారు లక్షల్లోనే ఉన్నారు. ఈ నగరం ఇలా విశ్వనగరంగా వర్ధిల్లాలని ఐదు శతాబ్దాల క్రితమే మన పూర్వీకులు దీవించారు. అందమైన నగరం నిర్మించాలని… నగరం నలుమూలలా సరస్సులను తవ్వించారు.

కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయల సంపాదన

హైదరాబాద్‌ ఎంత బాగుంటే మనం అంత బాగుంటాం అనేది మన పూర్వీకుల ఆలోచన. కానీ, ప్రస్తుతం ఇక్కడున్న వారికి హైదరాబాద్ చరిత్రతో పనిలేదన్నట్లే వ్యవహరిస్తున్నారు. అందమైన హైదరాబాద్.. ఆరోగ్య హైదరాబాద్.. ప్రశాంత హైదరాబాద్ కోరుకుంటూనే ఎవరికి తోచిన విధంగా వారు విధ్వంసం సృష్టిస్తున్నారు.

సువిశాల రోడ్ల కోసం, అత్యాధునిక వసతుల కోసం నగరం నడిబొడ్డున ఉన్న చెరువులు, నాలాలను కప్పేస్తున్నారు. కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పైసలు వస్తున్నాయని సంబరమే కానీ, భవిష్యత్‌ తరాలను నాశనం చేస్తున్నామని ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. ఇలాంటి వారి అత్యాశ ఫలితమే.. చిన్న వర్షం కురిసినా నగరంలో వరద పోటెత్తుతోంది… ఈ సమస్య పరిష్కారంతోపాటు భవిష్యత్‌ తరాలకు భద్రత కల్పించేందుకు ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది.

హైదరాబాద్ సిటీ పెరుగుతున్న కొద్దీ సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. ఓ వైపు అభివృద్ధి సూచికలు బలంగా కనిపిస్తున్నాయని ఆనందపడాలో… చేసిన తప్పులూ వెంటాడుతున్నాయని చింతించాలో తెలియని దుస్థితి. ఐదేళ్లు.. పదేళ్లుగా చేసిన తప్పులు కాదు.. మూడు, నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న తప్పులు ఇప్పుడు హైదరాబాద్‌ నగరాన్ని వెంటాడుతున్నారు. ఆ తప్పులు సరిదిద్దడం అంత తేలిక కాదు. కానీ, ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుంది. చెరువులను చెరబట్టిన వారి భరతం పడుతూ హైడ్రాకు ఫుల్‌ పవర్స్‌ ఇచ్చింది.

చెరువుల్లో 80 శాతం భూమి కబ్జా
చెరువుల కబ్జా అనేది ఇప్పుడే మొదలైంది కాదు.. హైదరాబాద్‌లో రియల్ బూమ్ ప్రారంభమైనప్పటి నుంచి నగరంలో చెరువులు, నీటికుంటలు, నాలాలు మాయమవుతూనే ఉన్నాయి. గత నాలుగు దశాబ్దాలలో నగరంలో దాదాపు అన్ని చెరువుల్లో 80 శాతం భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించింది ప్రభుత్వం. కొన్ని చెరువులు, కుంటలైతే పూర్తిగా ఆక్రమణలకు గురై కాలనీలుగా మారాయి. జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలో మొత్తం 920 చెరువులు ఉండగా, వాటిలో 491 చెరువులు కబ్జా అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి.

ఇందులో 282 చెరువులు చూద్దామన్నా కనిపించవు. అవన్నీ ఇప్పుడు కాలనీలుగా మారిపోయాయి. గ్రేటర్‌‌ నలుమూలలా చెరువుల ఆక్రమణ యథేచ్ఛగా సాగిపోయింది. హైడ్రా పుణ్యమాని ఇప్పుడు ఆక్రమణలపై చలనం వచ్చింది. ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన 43 ఎకరాలకు విముక్తి కల్పించింది. ఇకపై ఈ యజ్ఞం కొనసాగితే లేక్‌ సిటీకి పూర్వవైభవం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆ కల సాకారమయ్యే పరిస్థితి ఉందా? అనేదే సందేహాస్పదంగా మారింది.

Also Read: హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌తో పాటు హైదరాబాద్‌లో ఎవరెవరి అక్రమ నిర్మాణాలను కూల్చేశారో తెలుసా?