Lunar Eclipse
Lunar Eclipse : ఖగోళశాస్త్ర ప్రకారం మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడబోతుంది. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ (ఆదివారం) రాత్రి సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు, భూమి నీడ చంద్రునిపై పడుతుంది. అప్పుడు గాఢమైన ఎరుపు రంగు దర్శనమిస్తుంది. అందువల్ల దీనిని బ్లడ్ మూన్ అనికూడా పిలుస్తారు.
ఆదివారం (సెప్టెంబర్ 7వ తేదీ) రాత్రి 9.58గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 1.26గంటలకు ముగుస్తుంది. గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు 3గంటల 28 నిమిషాలు ఉంటుంది. శాస్త్రాల ప్రకారం.. చంద్రగ్రహణం సూతకాలం గ్రహణానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది. అంటే ఆదివారం మధ్యాహ్నం 12.57గంటలకు ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి గ్రహణ నియమాలను ఆచరించాలని చెబుతున్నారు. ఈ సూతకాలం చంద్రగ్రహణం ముగిసే వరకు ఉంటుంది.
2022 సంవత్సరం తరువాత మళ్లీ ఇప్పుడే సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో కనువిందు చేయనుంది. మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 డిసెంబర్ 31వ తేదీన సంభవిస్తుంది. అయితే, ప్రపంచంలోని దాదాపు 85శాతం మందికి ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఇండియా, చైనా సహా ఆసియా దేశాల్లో, ఆఫ్రికాలోని తూర్పు ప్రాంతాల్లో, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం, యూరోప్, ఆఫ్రికా దేశాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. అమెరికాలో ఇది కొంచెం కూడా కనిపించదు.
గ్రహణం మొత్తం 3గంటల 29 నిమిషాల 24సెకన్ల పాటు కొనసాగుతుంది. ఇందులో సంపూర్ణ చంద్రగ్రహణం దశ 82 నిమిషాలపాటు ఉంటుంది. గ్రహణం ప్రారంభ దశలో చంద్రుడు భూమి ఆవర్తనంలోకి ప్రవేశించగానే చీకటి కమ్ముకుంటుంది. ఇది పాక్షిక గ్రహణాన్ని సూచిస్తుంది. అనంతరం రేలీ స్కాటరింగ్ ప్రభావంతో చంద్రుడు ఎరుపు రంగులో మెరిసిపోనున్నాడు. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే గీతలోకి వచ్చేటప్పుడు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి ప్రవేశిస్తే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అదే కొంత భాగం మాత్రమే నీడలోకి వెళ్తే అది పాక్షిక చంద్రగ్రహణంగా పరిగణిస్తారు.
♦ పెనుంబ్రల్ గ్రహణం ప్రారంభం: ఆదివారం రాత్రి 8:58 గంటలకు.
♦ పాక్షిక గ్రహణం ప్రారంభం: రాత్రి 9:57 గంటలకు.
♦ సంపూర్ణ గ్రహణం (రక్త చంద్రుడు) ప్రారంభం : రాత్రి 11:00 గంటలకు
♦ గరిష్ట గ్రహణం: రాత్రి 11:41 గంటలకు.
♦ సంపూర్ణ గ్రహణం ముగింపు సమయం: సోమవారం 12:22 AM
♦ పాక్షిక గ్రహణం ముగింపు సమయం: సోమవారం 1:26 AM
♦ పెనుంబ్రల్ గ్రహణం ముగింపు సమయం: సోమవారం 2:25 AM
♦ మొత్తం వ్యవధి: 82 నిమిషాలు (రాత్రి 11:00 నుండి ఉదయం 12:22 వరకు)
♦ మొత్తం చంద్రగ్రహణం వ్యవధి: దాదాపు 3 గంటల 28 నిమిషాలు