Maha Kumbh Mela 2025 : మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. 8వ రోజున (జనవరి 20).. దాదాపు 23 లక్షల భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇప్పటివరకు మహాకుంభమేళాకు ఎనిమిదన్నర కోట్ల మంది యాత్రికులు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. రానున్న 10, 15 రోజుల్లో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 11న మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి 26న శివరాత్రిని పురస్కరించుకుని కుంభమేళాకు యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని యూపీ ప్రభుత్వం అంచనా.
మరోవైపు కుంభమేళాలో జరిగిన అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి అడ్వైజరీ జారీ చేసింది యూపీ ప్రభుత్వం. యాత్రికులకు, శిబిరాల నిర్వాహకులకు పలు సూచనలు చేసింది. అగ్నిప్రమాదం లేదా అత్యవసర సంఘటన జరిగినప్పడు 112, 1920, 1090 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించింది.
Also Read : ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం.. 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు.. హాజరైన అతిథులు వీరే..!
శిబిరాలు, టెంట్ల లోపల పెట్రోల్, కిరోసిన్ వంటి మండే పదార్ధాలను నిల్వ చేయద్దని ఫైర్ సేఫ్టీ అధికారులు సూచించారు. పాడైన, లీకైన గ్యాస్ సిలిండర్లను ఉపయోగించొద్దన్నారు. గ్యాస్ సిలిండర్లను భూమిలో పాతి పెట్టవద్దని చెప్పారు. టెంట్లు నిర్మించడానికి ప్లాస్టిక్ లేదా సింథటిక్ క్లాత్ ఉపయోగించవద్దని, బలమైన గాలులు వీస్తున్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఆరుబయట వంటలు చేయొద్దని చెప్పారు.
ఇక ప్రమాదం జరిగినప్పుడు సెల్ ఫోన్ లో వీడియోలు తియ్యడం కంటే ఆ మంటలను ప్రారంభంలోనే ఆర్పే ప్రయత్నం చేయాలని సూచించారు అగ్నిమాపక శాఖ అధికారులు.
Also Read : అధ్యక్షుడిగా ట్రంప్ ఫస్ట్ స్పీచ్.. అమెరికాలో స్వర్ణయుగం ప్రారంభమైంది.. ఇంకా ఏమన్నారంటే?