Srisailam mallanna sparsha darshanam
శ్రీశైలం మల్లన్న స్వామీ భక్తులకు శుభవార్త. జులై 1 నుంచి స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభం కానుంది. ఈమేరకు ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారిక ప్రకటన చేశారు. బుధవారం ఉచిత స్పర్శదర్శన క్యూలైన్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన సామాన్య భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రతీ మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1: 45 నుంచి 3:45 వరకు రెండు గంటల పాటు ఉచిత స్పర్శదర్శనం ఉంటుందని తెలిపారు. దీనికి సంబందించిన ఉచిత దర్శన టోకన్లను భక్తులు ఏరోజుకారోజు పొందేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రతీ రోజు 1000 నుండి 1200 వరకు ఉచిత స్పర్శదర్శన టోకన్లు అందజేస్తామని, ఇందుకోసం రెండు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, టోకన్లలో భక్తుడి పేరు,ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ తదితర వివరాలు ఉంటాయని తెలిపారు. అలాగే భక్తుల రద్దీ సమయంలో క్యూలైన్లలో ఎలాంటి తొక్కిసలాటలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని భద్రతా విభాగాన్ని ఆదేశించారు. దీంతో శ్రీశైలం మల్లన్న స్వామీ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.