Dhana Trayodashi 2024: ఇవాళ ధన త్రయోదశి.. యమ దీపం వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా?

ధన త్రయోదశి సాయంత్రం వేళ ఇంటి గుమ్మం ముందు యమ దీపం వెలిగిస్తుంటారు. ఈ చేయడం వల్ల ద్వారా సర్వ మృత్యు దోషాలు తొలగిపోవడంతోపాటు.. ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు సైతం దూరమవుతాయని నమ్ముతారు.

Dhana Trayodashi

Dhana Trayodashi 2024 in Telugu: ఇవాళ ధన త్రయోదశి. ప్రతీయేటా దీపావళి ముందు వచ్చే ఈ ధన త్రయోదశిని దేశవ్యాప్తంగా హిందువులు భక్తిశ్రద్దలతో నిర్వహిస్తుంటారు. ధన త్రయోదశిని చాలా మంది ధన్ తేరస్ అని కూడా పిలుస్తారు. ధన త్రయోదశి తిథి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తే ఇంట్లో సిరిసంపదలకు ఎలాంటి లోటు కలగదని, కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారని విశ్వసిస్తారు. ఇవాళ బంగారం, వెండి, ఆభరణాలు, వాహనాలు, పాత్రలు మొదలైనవాటిని కొనుగోలు చేస్తే ధన లాభం కలుగుతుందని విశ్వసిస్తారు. అదేవిధంగా ఇవాళ (ధన త్రయోదశి) సాయంత్రం వేళ ఇంటి గుమ్మం ముందు యమ దీపం వెలిగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ద్వారా సర్వ మృత్యు దోషాలు తొలగిపోవడంతోపాటు.. ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు సైతం దూరమవుతాయని నమ్ముతారు.

యమ దీపం ఎప్పుడు వెలిగించాలి..
ధన త్రయోదశి రోజు (ఇవాళ) యముడి పేరుతో దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల అకాల మృత్యుభయం నుంచి ఉపశమనం కలుగుతుందని, సంవత్సరం అంతా ఇంట్లోని కుటుంబ సభ్యులకు అపమృత్యు దోషాలు ఉండవని నమ్ముతారు. యమ దీపం వెలిగించేందుకు సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.12 గంటల వరకు మంచి సమయం.

ఎలా వెలిగించాలి..
యమ దీపాన్ని గోదుమ పిండితో వెలిగిస్తారు. ముందుగా గిన్నెలో కొద్దిగా గోధుమ పిండి తీసుకోవాలి. అందులో బెల్లం తురుము, పచ్చి ఆవు పాలు పోసి ఒక పిండి దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. పిండి దీపాన్ని ఇంటి గుమ్మ ముందు పెట్టి అందులో నువ్వుల నూనె పోయాలి. దక్షిణం దిక్కువైపు వెలిగేలా ఎన్ని వత్తులు అయినా వేసి దీపం వెలిగించుకోవచ్చు. యమ దీపం వద్ద ఒక తమలపాకులో రాగి నాణెం లేక రూపాయి నాణెం, గవ్వ ఉంచాలి. యమ దీపం దగ్గర తమలపాకులో కొద్దిగా బియ్యం, బెల్లం నైవేద్యంగా పెట్టాలి. యమ దీపం కొండెక్కిన తరువాత మరుసటి రోజు స్నానం చేసి పిండి దీపం, నాణెం, గవ్వ, నైవేద్యం ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలా వీలులేకుంటే పారే నీళ్లలో అయినా విడిచిపెట్టవచ్చు. ఇలా చేయడం వల్ల యమధర్మ రాజు అనుగ్రహం కలుగుతుందని, తద్వారా ఈ ఏడాదంతా కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని విశ్వసిస్తారు.

ఈ కథనంలో సమాచారం కొందరు జోతిష్య నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా పొందుపర్చడం జరిగింది. దీనిని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.