మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పిస్తాం

  • Publish Date - February 8, 2020 / 07:48 AM IST

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క  సారక్క జాతర వైభవంగా జరుగుతోంది.  గద్దెలపై కొలువు దీరిన వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాక  దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండా  శనివారం మేడారం జాతరకు వచ్చి గద్దెలపై ఉన్న వన దేవతలను దర్శించుకుని, నిలువెత్తు బంగారం సమర్పించారు.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పిస్తామని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండా స్పష్టం చేశారు. దర్శనం అనంతరం అర్జున్‌ ముండా విలేకరులతో  మాట్లాడుతూ…. దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజనులు సమ్మక, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటారు అని తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే దేవతలుగా సమ్మక్క – సారలమ్మ ప్రసిద్ధికెక్కారు అని పేర్కొన్నారు. త్వరలోనే మేడారం మహాజాతరకు జాతీయ గిరిజన పండగ కల సాకారం అవుతోందని ఆశిస్తున్నాను అని ఆయన అన్నారు.

జాతీయ పండుగ హోదా అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని.. త్వరలోనే గిరిజనుల కలను నిజం చేస్తానని అర్జున్‌ ముండా స్పష్టం చేశారు. అర్జున్‌ ముండాకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి,  మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ ఘనస్వాగతం పలికారు. మంత్రులు ఆయనకు దగ్గరుండి దర్శనం చేయించారు.