Chaturmasya Vratham: చాతుర్మాస్య వ్రతం ప్రత్యేకత.. ఒక్కో నెల ఒక్కో ఆహారం.. నేలపై నిద్ర.. ఈ వ్రతం చేస్తే..

Chaturmasya Vratham: చాతుర్మాస్య వ్రతం అనేది ఆషాఢ శుద్ధ ఏకాదశి (శయన ఏకాదశి) నుండి ప్రారంభమై, కార్తిక శుద్ధ ఏకాదశి (ఉత్తాన ఏకాదశి) వరకు కొనసాగుతుంది.

Chaturmasya Vratham: చాతుర్మాస్య వ్రతం ప్రత్యేకత.. ఒక్కో నెల ఒక్కో ఆహారం.. నేలపై నిద్ర.. ఈ వ్రతం చేస్తే..

Chaturmasya Vratam Significance and health benefits

Updated On : July 8, 2025 / 10:15 PM IST

చాతుర్మాస్య వ్రతం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, నియమానుసారమైన వ్రతాలలో ఒకటి. “చాతుర్ అంటే నాలుగు మాస్య అంటే మాసం” కాబట్టి ఇది నాలుగు మాసాలు పాటు కొనసాగుతుంది. ఈ కాలాన్ని భక్తులు ఎంతో శ్రద్ధగా ఆచరిస్తూ, ఆచారాలను పాటిస్తూ, పూజలు, వ్రతాలు చేసి ఆధ్యాత్మిక సాధనకు అంకితమవుతారు.

చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి? దాని ప్రత్యేకత?

చాతుర్మాస్య వ్రతం అనేది ఆషాఢ శుద్ధ ఏకాదశి (శయన ఏకాదశి) నుండి ప్రారంభమై, కార్తిక శుద్ధ ఏకాదశి (ఉత్తాన ఏకాదశి) వరకు కొనసాగుతుంది. ఈ నాలుగు మాసాలు విష్ణు భగవానుడు యోగనిద్రలో ఉండే కాలంగా పరిగణించబడతాయి. ఈ సమయంలో భక్తులు పరమ పవిత్రంగా ఉంటూ వ్రతాలు, ఉపవాసాలు, నియమాలు పాటిస్తూ భగవంతుని ఆశీర్వాదం పొందే ప్రయత్నం చేస్తారు.

చాతుర్మాస్య పరంపరలు ముఖ్యాంశాలు:

1.ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం:
ఈ మాసాల్లో భక్తులు ఎక్కువగా ధ్యానం, జపం, పఠనం, పూజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది మనస్సును శాంతియుతంగా, శుద్ధంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

2.నియమాలు పాటించడం:
చాతుర్మాసంలో భక్తులు నిష్టగా నియమాలను పాటిస్తారు. వాటిలో ముఖ్యమైనవి మాంసాహార విరమణ, ఉప్పు/ఉల్లి/వెల్లుల్లి వంటి కొన్ని పదార్థాల వర్జన, ఒకే భోజనం (ఏక భుక్తం) లేదా పండ్లాహారం, ఉపవాసాలు – ముఖ్యంగా ఏకాదశి రోజున, తులసి సేవనం, బ్రహ్మచర్యం పాటించడం, రాత్రి భోజనం మానేయడం,

3.పూజలు, వ్రతాలు:

  • శయన ఏకాదశి పూజలు
  • వార పూజలు. ప్రతి వారానికీ ప్రత్యేక దేవతను పూజించడం.
  • కృష్ణాష్టమి, వరలక్ష్మీ వ్రతం, గణేశ చతుర్థి, నవరాత్రులు వంటి ఉత్సవాలు, పండుగలు ఈ కాలంలోనే వస్తాయి.
  • కార్తీక మాసంలో దీపదానం, తులసి వివాహం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.

చాతుర్మాస్య వ్రతం విజ్ఞానపరంగా కూడా మంచిదే:

చాతుర్మాసం విజ్ఞాన పరంగా కూడా చాలా మంచిది. ఎందుకంటే? ఈ సమయంలో వర్షాకాలం ఉంటుంది. ఈ కాలంలోనే శరీర ధాతువులు మార్పు చెందుతాయి. దానివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాంటప్పుడు తక్కువ, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. ఇది నిపుణులు చెప్తున్న మాట. అలా ఆరోగ్యానికి కూడా చాతుర్మాస్య వ్రతం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా, మానసిక స్థితి మీద ప్రభావం ఉండే కాలం కాబట్టి, ధ్యానం, ఆచారాల వలన మానసిక స్థైర్యం ఏర్పడుతుంది. గుడులు, ఆశ్రమాలలో ఉండే గురువులు కూడా ఈ నాలుగు నెలల పాటు ఒకేచోట ఉండి, ధర్మ బోధన చేస్తారు. ఆలా చేయడాన్ని చాతుర్మాస్య నివాసం అని పిలుస్తారు.

చాతుర్మాస్యంలో ఒక్కో నెలకు ఒక్కో ప్రత్యేకత:

ఆషాఢం: శయన ఏకాదశి ఇది విష్ణుమూర్తి యోగనిద్రకు వెళ్లే సమయం

శ్రావణం: శివపూజ, వరలక్ష్మి వ్రతం, నాగ పంచమి

భాద్రపదం: కృష్ణాష్టమి, గణేశ చతుర్థి, రాధాష్టమి

ఆశ్వయుజం / కార్తికం: నవరాత్రులు, దీపావళి, తులసి వివాహం, కార్తీక దీపాలు

ఇన్ని గొప్ప ప్రత్యేకతలకు ఉన్నాయి కాబట్టి చాతుర్మాస్య వ్రతం అనేది ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా శుద్ధిని, శాంతిని అందించే గొప్ప నియమ వ్రతం. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి అనుగుణంగా ఈ కాలాన్ని ధర్మపరంగా గడపాలనేది ధార్మిక తత్వం.