Womens World Cup: భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి 52 ఏళ్ల టోర్నమెంట్ చరిత్రలో తొలిసారి టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆ జట్టు కలిసింది. వారికి మోదీ అభినందనలు తెలిపారు.
పాలసీలు స్పష్టంగా ఉంటే ఫలితాలు కూడా ఫలప్రదంగా ఉంటాయని.. క్రీడలను ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం చేపట్టిన సానుకూల చర్యలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయి. (Womens World Cup)
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచ కప్ గెలుచుకుంది. ఈ విజయానంతరం బీసీసీఐ మహిళా జట్టుకు రూ.51 కోట్లు బహుమతిగా ప్రకటించింది.
టైటిల్ గెలుచుకున్నందుకు మహిళా జట్టుకు రూ.41.77 కోట్లు బహుమతిగా అందాయి. ఇది 2022లో ఉన్న మొత్తానికి నాలుగు రెట్లు ఎక్కువ. బీసీసీఐ అదనంగా రూ.51 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
మహిళా క్రికెట్‌ను అభివృద్ధి చేయడంలో బీసీసీఐ కీలక పాత్ర పోషించింది. కోచింగ్ సదుపాయాలు, సపోర్ట్ స్టాఫ్, శిక్షణను మెరుగుపరిచింది. భారత మహిళా ఆటగాళ్ల వేతనాలు పెరిగాయి. ఐసీసీ మహిళా టోర్నమెంట్‌ల బహుమతి మొత్తం పురుషుల టోర్నమెంట్‌లకంటే ఎక్కువైంది. 2022 అక్టోబరులో బీసీసీఐ 15వ ఏపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
పురుషులు, మహిళా క్రికెటర్లకు సమాన మ్యాచ్ ఫీజులు అమలు చేసింది. వేతన పెంపు అనేకమంది మహిళా ప్లేయర్లను మరింత ప్రోత్సహించింది. ఈ నిర్ణయంతో భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
బీసీసీఐ సమాన వేతనం గురించి చర్చించడమే కాకుండా అమలు చేసిన కొద్ది బోర్డుల్లో ఒకటిగా నిలిచింది. 2018లో తొలిసారిగా మహిళా ఆటగాళ్లకు ఫిట్‌నెస్ శిక్షణ, యో-యో టెస్ట్ తప్పనిసరి చేశారు. 2019లో మహిళా ప్లేయర్ల సెంట్రల్ కాంట్రాక్టులను సవరించారు. 2025 నాటికి కాంట్రాక్టు ప్లేయర్లు సంవత్సరానికి రూ.75 లక్షల నుంచి రూ.3 కోట్ల మధ్య సంపాదిస్తున్నారు.
అమెరికా మహిళా ఫుట్‌బాల్ జట్టు సమాన వేతనాల కోసం సంవత్సరాల పాటు న్యాయ పోరాటం చేసింది. కానీ, భారతదేశంలో బీసీసీఐ నమ్మకంతో, విధానాల ఆధారంగా స్వయంగా మార్పును తీసుకువచ్చింది. ఫలితాలు అందరికీ కనిపిస్తున్నాయి.
గతంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ కంటే భారత మహిళా క్రికెట్ వెనుకబడి ఉండేది. టీమిండియా ముందుకు దూసుకు రావడానికి 2023లో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభమైంది.
డబ్ల్యూపీఎల్ వల్ల భారత ప్లేయర్లకు ప్రపంచస్థాయి క్రికెటర్లతో ఆడే అవకాశం ఇచ్చింది. దీనివల్ల వారి ఆత్మవిశ్వాసం, ప్రదర్శన రెండూ పెరిగాయి.
డబ్ల్యూపీఎల్ ప్రారంభం తర్వాత జట్టు మేనేజ్‌మెంట్ దేశీయ క్రికెట్‌పై దృష్టి పెట్టింది. 2017 వరకు జట్టులో ప్రధానంగా ఢిల్లీ, ముంబై, దక్షిణ భారత ఆటగాళ్లే ఉండేవారు. కొత్త స్కౌటింగ్ వ్యవస్థతో రాయ్‌గఢ్, హిసార్, ఆగ్రా, సిల్చర్ వంటి చిన్న పట్టణాల నుంచి ప్రతిభావంతులను ఎంపిక చేశారు.
మోదీ ప్రభుత్వం ఇంకా ఏయే మార్పులు తీసుకొచ్చింది?
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత విజయం మోదీ ప్రభుత్వం క్రీడల పట్ల ఎంత గొప్ప విధానాలను అవలంబించిందో నిరూపిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 15న క్రీడలపై స్పందిస్తూ.. “దేశమంతటా కుటుంబాలు తమ ఇళ్లలో క్రీడలను ప్రోత్సహిస్తున్నప్పుడు నా హృదయం గర్వంతో నిండిపోతుంది. ఇది మన దేశ భవిష్యత్తుకు అత్యంత సానుకూల సూచన అని నేను భావిస్తున్నాను” అని చెప్పారు.