దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కి భారత స్క్వాడ్ ప్రకటన.. రిషబ్ మళ్లీ వచ్చేశాడు.. పాపం ఆ బౌలర్‌ని మాత్రం తీసి పక్కన పెట్టి..

తొలిటెస్ట్ నవంబర్‌ 14న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ప్రారంభమవుతుంది. ఆ మైదానం ఆరు సంవత్సరాల తర్వాత టెస్ట్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది.

దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కి భారత స్క్వాడ్ ప్రకటన.. రిషబ్ మళ్లీ వచ్చేశాడు.. పాపం ఆ బౌలర్‌ని మాత్రం తీసి పక్కన పెట్టి..

Updated On : November 5, 2025 / 6:52 PM IST

India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌కు అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్‌, వెస్టిండీస్‌తో రెండు టెస్టులు మిస్ అయిన రిషబ్ పంత్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు.

ఈ సిరీస్‌ 2025-2027 ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో రెండు జట్లకూ కీలకం. (India vs South Africa) వెస్టిండీస్‌పై 2-0 తేడాతో భారత జట్టు గెలిచిన విషయం తెలిసిందే. ఆ జట్టులో ఆడిన వారిలో ఇద్దరిని మాత్రమే బీసీసీఐ దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కి తీసుకోలేదు. జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. నారాయణ జగదీశన్‌ స్థానంలో పంత్‌ వచ్చాడు. అలాగే ప్రసిద్ధ్‌ కృష్ణ స్థానంలో ఆకాశ్‌ దీప్‌ ఎంపికయ్యాడు.

రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున అద్భుతంగా ఆడుతున్నప్పటికీ మహ్మద్‌ షమీకి దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో అవకాశం ఇవ్వలేదు. వెస్టిండీస్‌ సిరీస్‌ సమయంలో అగార్కర్‌.. షమీ గురించి మాట్లాడుతూ అతడు మ్యాచ్‌లు ఎక్కువగా ఆడలేదని చెప్పాడు. అయితే, షమీ బెంగాల్‌ తరఫున ఆడి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో చోటు దక్కలేదు. షమీ 2023 జూన్‌ తర్వాత టెస్ట్‌ మ్యాచ్‌ ఆడలేదు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు దూరంగా ఉన్నాడు.

Also Read: Hyderabad: దుస్తులపై చట్నీ పడేశాడని వ్యక్తిని దారుణంగా చంపేన నలుగురు యువకులు

తొలిటెస్ట్ నవంబర్‌ 14న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ప్రారంభమవుతుంది. ఆ మైదానం ఆరు సంవత్సరాల తర్వాత టెస్ట్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. తర్వాత రెండో టెస్ట్‌ గౌహతిలోని బార్సపారా స్టేడియంలో జరుగుతుంది. ఆ మైదానంలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌ ఇది.

ఈ సిరీస్‌ 2025లో భారత్‌ ఆడబోయే చివరిది. వచ్చే ఏడాది జూన్‌లో అఫ్ఘానిస్థాన్‌తో ఒక టెస్ట్‌ మ్యాచ్‌ ఉంది. తర్వాత 2026లో ఆగస్టు శ్రీలంకలో తదుపరి ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ కాంపిటేషన్ ఉంటుంది. శుభ్‌మన్‌ గిల్‌ నాయకత్వంలోని జట్టు దేశంలో మళ్లీ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడేది 2027 ఫిబ్రవరిలో మాత్రమే. భారత్‌ పర్యటనలో ఆస్ట్రేలియా ఐదు టెస్ట్‌ల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ ఆడనుంది.

దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు భారత స్క్వాడ్

శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌, వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, దేవదత్‌ పడిక్కల్‌, ధ్రువ్‌ జురెల్‌, రవీంద్ర జడేజా‌, వాషింగ్టన్‌ సుందర్‌, జస్ప్రీత్‌ బుమ్రా‌, అక్షర్‌ పటేల్‌, నితీశ్ కుమార్‌ రెడ్డి‌, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఆకాశ్‌ దీప్‌.