Hazratullah Zazai : అఫ్గాన్ క్రికెటర్ హజ్రతుల్లా జజాయ్ ఇంట తీవ్ర విషాదం.. చనిపోయిన కూతురు..
అఫ్గానిస్థాన్ స్టార్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది

PC:ANI
అఫ్గానిస్థాన్ స్టార్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె మరణించింది. ఈ విషయాన్ని అతడి సహచరుడు, స్నేహితుడు కరీం జనత్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశాడు. జజాయ్, అతడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
‘నా సోదరుడు లాంటి సన్నిహిత మిత్రుడు హజ్రతుల్లా జజాయ్ తన కుమార్తెను కోల్పోయాడని మీ అందరితో పంచుకోవడానికి నేను ఎంతో బాధపడుతున్నాను. నా హృదయం ఎంతో భారంగా మారింది. ఈ కష్ట సమయంలో అతని, అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మీరంతా కూడా అతడి, అతడి కుటుంబం కోసం ప్రార్థించండి.’ అని కరీం జనత్ రాసుకొచ్చాడు.
ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో హజ్రతుల్లా జజాయ్ కు చోటు దక్కలేదు. 2016లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి హజ్రతుల్లా అరంగ్రేటం చేశాడు. ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు ఇప్పటి వరకు అఫ్గాన్ తరుపున 16 వన్డేలు, 45 టి20లు ఆడాడు. వన్డేల్లో 361 పరుగులు, టీ20ల్లో 1160 పరుగులు చేశాడు.
26 ఏళ్ల ఈ ఆటగాడు ఐర్లాండ్ పై 62 బంతుల్లోనే 11 ఫోర్లు, 11 సిక్సర్లతో 162 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. చివరి సారిగా అతడు 2024 డిసెంబర్‌లో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు.