The Hundred : పాకిస్తాన్ క్రికెటర్లకు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 మంది..
ది హండ్రెడ్ లీగ్ డ్రాఫ్ట్‌లో పాక్ ఆటగాళ్లు ఘోర అవమానం ఎదురైంది.

Pakistan Cricketers All 50 Go Unsold In The Hundred Draft
పాకిస్తాన్ క్రికెటర్ల ఆటతీరు నానాటికి తీసి కట్టుగా మారుతోంది. ఆ జట్టు ఆటగాళ్లను తీసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు లీగుల్లోని ఫ్రాంఛైజీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇందుకు ది హండ్రెడ్ లీగ్ డ్రాప్ట్ చక్కని ఉదాహరణ. ఈ లీగ్‌లో మొత్తం 50 మంది పాక్ క్రికెటర్లు అమ్ముడుపోలేదు. ఈ 50 మందిలో 45 మంది పురుష క్రికెటర్లు కాగా 5 గురు మహిళా క్రికెటర్లు ఉన్నారు.
మహిళా క్రికెటర్ల విభాగంలో అలియా రియాజ్, ఫాతిమా సనా, యుస్రా అమీర్, ఇరామ్ జావేద్, జవేరియా రౌఫ్‌లకు నిరాశే ఎదురుకాగా.. పురుషుల విభాగంలో స్టార్ ఆటగాళ్లు ఇమాద్ వసీం, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ లను కొనేందుకు ఒక్క జట్టు ముందుకు రాలేదు. అయితే.. పాక్ పేసర్ నసీమ్ షా మాత్రం అత్యధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం.
అఫ్గానిస్థాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌లు మంచి ధరను సొంతం చేసుకున్నారు. నూర్‌ను మాంచెస్టర్ ఒరిజినల్స్ దక్కించుకోగా, బ్రేస్‌వెల్‌ను సదరన్ బ్రేవ్ కొనుగోలు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్‌ను లండన్ స్పిరిట్ తీసుకుంది.
తీవ్ర ఆర్థిక సంక్షభంలో పీసీబీ!
ఇదిలా ఉంటే.. ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు తీవ్ర ఆర్థిక ఒత్తిడిలను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పీసీబీ దేశవాళీ క్రికెట్‌లో మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించడం గమనార్హం.
మార్చి14 నుంచి ప్రారంభం కానున్న జాతీయ టీ20 ఛాంపియన్ షిప్‌లో పాల్గొనే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును లక్ష పాకిస్తాన్ రూపాయల నుంచి 10వేలకు తగ్గించింది. ఇక రిజర్వ్ ప్లేయర్లకు రూ5వేలు మాత్రమే దక్కనుంది.
పీసీబీ మ్యాచ్ ఫీజుల్లో కోత విధించడాన్ని ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో దేశీయ క్రికెట్ అభివృద్ధి కోసం చేసే ఖర్చును తగ్గించుకునే ప్రయత్నంలో పీసీబీ ఉందనే వార్తలు వస్తున్నాయి.