Ajit Agarkar comments on removing Rohit sharma odi captaincy
Ajit Agarkar : టీమ్ఇండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను బీసీసీఐ తప్పించింది. అతడి స్థానంలో టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. శనివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన విలేకరుల సమావేశంలో ఈ అంశంపై చీఫ్ సెలక్టర్ అగార్కర్ (Ajit Agarkar ) స్పందించాడు.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందన్నాడు. జట్టు అత్యుత్తమ ప్రయోజనాల గురించే ఆలోచించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉండడం ఆచరణాత్మకంగా అసాధ్యం అని అన్నాడు. అందుకనే వన్డే కెప్టెన్సీ బాధ్యతలను గిల్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేరు వేరు కెప్టెన్లు ఉంటే.. సెలక్షన్ పరంగా ఇబ్బందులు ఉంటాయని, ఇక కోచ్ కూడా ముగ్గురు కెప్టెన్లతో వేరు వేరుగా ప్లాన్ చేయాల్సి ఉంటుందని, అది కాస్త కష్టమైన పని అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తమ దృష్టి అంతా టీ20 ప్రపంచకప్ పైనే ఉందని, ఇక వన్డే ఫార్మాట్‌లో కుదురుకునేందుకు కెప్టెన్‌గా గిల్‌కు కొంత సమయం ఇవ్వాలనేది తమ ప్రణాళిక అని వెల్లడించాడు.
కెప్టెన్సీ మార్పు విషయమై ఇప్పటికే రోహిత్‌తో చర్చించినట్లుగా అగార్కర్ చెప్పుకొచ్చాడు. అయితే.. రోహిత్ ఎలా స్పందించాడు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇది చాలా కఠిన నిర్ణయం అని మాత్రమే తెలిపాడు.
AJIT AGARKAR ON INDIA CAPTAINCY:
“Practically impossible to have three captains for three formats. And it is the least played format currently. Focus is on T20 World Cup. Plan is to give Gill time to adjust”. pic.twitter.com/oAhiwBvRMC
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2025
‘ఇంగ్లాండ్‌లో తీవ్ర ఒత్తిడిలో గిల్ ఎలా రాణించాడో మనం చూశాం. అతడు ఇంకా చిన్నవాడే. అతడిపై అంచనాలు ఉన్నాయి. గత కొంతకాలంగా అతడు వన్డేలకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. వన్డే ప్రపంచకప్ 2027కు ముందు టీమ్ఇండియా ఎక్కువ వన్డేలు ఆడడం లేదు. ఇది కొంచెం ప్రతికూలాంశం. అందుకనే వన్డే కెప్టెన్‌గా గిల్ కుదురుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని అనుకుంటున్నాం.’ అని అగార్కర్ అన్నాడు.
IND vs WI : తొలి టెస్టులో వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం.. ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో..
రోహిత్ , కోహ్లీ వన్డే ప్రపంచకప్ 2027 భవితవ్యం పై..
2027లో జరిగే తదుపరి వన్డే ప్రపంచ కప్‌లో ఆడటానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇంకా కమిట్ కాలేదని అజిత్ అగార్కర్ వెల్లడించారు. రో-కో భవిష్యత్తుపై ఊహాగానాలను ప్రస్తావిస్తూ.. ప్రస్తుత జట్టును ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్ కోసం మాత్రమే ఎంపిక చేశారని, 8 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం ఉన్న తరువాత కోహ్లీ, రోహిత్‌లు ఎలా ఆడతారో చూడాల్సి ఉందన్నాడు. వారిద్దరు ఆడుతున్న ఏకైక ఫార్మాట్ ఇదేనని అన్నాడు.