IND vs WI : తొలి టెస్టులో వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం.. ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో..
తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై (IND vs WI) ఘన విజయం సాధించింది.

Team India won by innings 140 runs against West Indies in 1st test
IND vs WI : రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ విజయం (IND vs WI) సాధించింది.
286 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వెస్టిండీస్ 45.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో అలిక్ అథనాజ్ (38), జస్టిన్ గ్రీవ్స్ (25)లు పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ పడగొట్టాడు.
భారత్‌కు 286 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం..
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్ (32), షై హోప్ (26), రోస్టన్ చేజ్ (24)లు పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు సాధించాడు. కుల్దీప్ యాదవ్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత మొదటి ఇన్నింగ్స్ ను ఆరంభించిన భారత్ కేఎల్ రాహుల్ (100; 190 బంతుల్లో 12 ఫోర్లు), ధ్రువ్ జురేల్ (125; 210 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు), రవీంద్ర జడేజా (104 నాటౌట్; 176 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ (9 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
అయితే.. మూడో రోజు ఉదయం ఒక్క బంతి కూడా ఆడకుండానే భారత్ అదే స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 286 లోటులో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 146 పరుగులకు కుప్పకూలింది.
మ్యాచ్ స్కోర్లు..
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్.. 162 ఆలౌట్
భారత తొలి ఇన్నింగ్స్ .. 448/5 డిక్లేర్
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్.. 146 ఆలౌట్