ఆపరేషన్ సిందూర్‌పై డీజీఎంవో బ్రీఫింగ్‌లో కోహ్లీ గురించి ప్రస్తావన.. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఏమన్నారంటే?
ఆయన క్రికెట్ విశ్లేషణ పద్ధతిని వాడుకున్నారు.

ఆపరేషన్ సిందూర్‌పై ఇవాళ ఢిల్లీలో భారత త్రివిధ దళాల అధికారులు వివరాలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రస్తావించారు. టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటన చేసిన వేళ ఈ విషయాన్ని గుర్తు చేశారు. భారతదేశ రక్షణ వ్యవస్థల గురించి వివరించే ముందు ఆయన కోహ్లీ పేరును తీసుకురావడం గమనార్హం.
అలాగే, భారతదేశ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థత గురించి వివరించడానికి క్రికెట్‌ను ఉదాహరణగా తీసుకున్నారు. భారతదేశ రక్షణ వ్యవస్థలు శత్రుదేశం నుంచి వచ్చే ముప్పు నుంచి ఎలా బయటపడేస్తాయో, మిసైళ్ల వంటి వాటిని ఎలా ఎదుర్కొంటాయో చెప్పడానికి ఆయన క్రికెట్ విశ్లేషణ పద్ధతిని వాడుకున్నారు.
Also Read: Google Pixel 9 Pro XL స్మార్ట్‌ఫోన్‌పై కళ్లుచెదిరే ఆఫర్.. వేలాది రూపాయల డిస్కౌంట్
“ఇవాళ మనం క్రికెట్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిందే. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాడు. చాలా మంది భారతీయుల అభిమాన క్రికెటర్ అతడు. అలాగే, నా ఫేవరేట్ క్రికెటర్ కూడా కోహ్లీనే.
మన గగనతలాన్ని, లాజిస్టిక్స్‌ను టార్గెట్ చేయడం చాలా కష్టం. 1970 దశకంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతోంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు జెఫ్ థామ్సన్, డెన్నిస్ లిల్లే ఇంగ్లాండ్ బ్యాటర్ల వెన్నువిరిచారు (వెనువెంటనే ఔట్ చేశారు).
యాషెస్ టు యాషెస్.. డస్ట్ టు డస్ట్.. ఆ ఇద్దరు బౌలర్లలో ఒకరి చేతిలో ఔట్ కాకుండా ఏ బ్యాటరైనా తప్పించుకుంటే.. మరో బౌలర్ చేతిలోనైనా ఆ బ్యాటర్ ఔట్ కావడం ఖాయం” అని అన్నారు. అచ్చం అలాగే, భారతదేశ మల్టీ టైర్డ్ ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌లోని ఎన్నో లేయర్ల నుంచి శత్రుదేశ యుద్ధ విమానాలు, డ్రోన్లు తప్పించుకుని వచ్చినా గ్రిడ్ సిస్టమ్‌లోని ఏదో ఒక లేయర్ వాటిని ధ్వంసం చేయకతప్పదని అన్నారు. పాకిస్థాన్ నుంచి దూసుకొచ్చిన యుద్ధ విమానాలు, డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.