Suryakumar Yadav
Asia Cup 2025 IND vs PAK : ఆసియా కప్ -2025 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బౌలర్లు, బ్యాటర్లు రాణించడంతో పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో టీమిండియా చిత్తుచేసింది. పాకిస్థాన్ జట్టుపై విజయం అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
Also Read: Asia Cup 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులు, సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు. పహల్గాం ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని భావిస్తున్నాను. బాధిత కుటుంబాలకు మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన సాయుధ దళాలన్నింటికీ ఈ విజయాన్ని అంకితం చేయాలని అనుకుంటున్నాం. మనందరికీ వారు స్ఫూర్తినిస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా వారి ముఖాల్లో చిరునవ్వు ఉండే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాం అంటూ సూర్య కుమార్ యాదవ్ వివరించారు.
Suryakumar Yadav said “We stand with the victims of the families of Pahalgam – we express our solidarity – want to dedicate the win to all our armed forces, hope they continue to inspire us all”. pic.twitter.com/SpJ2UAJHdF
— Johns. (@CricCrazyJohns) September 14, 2025
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లు ఫర్హాన్ (40), షహీన్ అఫ్రిది (33నాటౌట్) మినహా మిగిలిన బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. భారత బౌలర్లు కుల్డీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, జస్ర్పీత్ బుమ్రా రెండేసి చొప్పున వికెట్లు పడగొట్టారు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యలు ఒక్కో వికెట్ తీశారు.
పాకిస్థాన్ నిర్దేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు అలవోకగా చేధించింది. 15.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 47 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తిలక్ వర్మ 31 పరుగులతో రాణించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్ చేశాడు. 13 బంతుల్లోనే 31 రన్స్ చేశాడు. 2 సిక్సులు, 2 ఫోర్లు బాదాడు.