Asia Cup 2025 Team India set to achieve major T20I milestone
IND vs OMAN : ఆసియాకప్ 2025లో భాగంగా శుక్రవారం భారత జట్టు అబుదాబి వేదికగా ఒమన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం పెద్ద కష్టం కాదు. ఇప్పటికే భారత్ సూపర్-4కి అర్హత సాధించిన నేపథ్యంలో ఈ మ్యాచ్ నామమాత్రంగానే మారింది. అయినప్పటికి కూడా ఈ మ్యాచ్ టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం. భారత క్రికెట్ చరిత్రలోనే ఈ మ్యాచ్ ఓ మైలురాయిగా మిగిలిపోనుంది.
ఒమన్‌తో ఆడనున్న ఈ మ్యాచ్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత జట్టు ఆడనున్న 250వ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 250 ఫ్లస్ మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా భారత్ నిలవనుంది. తొలి స్థానంలో పాక్ ఉంది. పాక్ ఇప్పటి వరకు 275 టీ20 మ్యాచ్‌లు ఆడింది.
తుది జట్టు కూర్పు పైనే..
ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు కూర్పు పైనే ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ ముగిసిన ఒక్క రోజు వ్యవధిలోనే (ఆదివారం, సెప్టెంబర్ 21న) భారత జట్టు సూపర్4లో భాగంగా పాక్‌తో తలపడనుంది. ఈ క్రమంలో ఒమన్‌తో మ్యాచ్‌లో పలువురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.
అదే సమయంలో ఇప్పటి వరకు ఈ టోర్నీలో అవకాశం రానీ ఆటగాళ్లను ఈ మ్యాచ్ ద్వారా పరీక్షించే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బుమ్రా, శివమ్ దూబె స్థానాల్లో అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్‌లకు జట్టులో చోటు దక్కనుందని అంటున్నారు.
అబుదాబిలో భారత్ రికార్డులు ఇవే..
అబుదాబి స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు ఒకే ఒక టీ20 మ్యాచ్ ఆడింది. 2021 టీ20 ప్రపంచకప్ సందర్భంగా అఫ్గాన్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో భారత్ 66 పరుగుల తేడాతో గెలుపొందింది.