Mohammad Nabi : న‌బీ సంచ‌ల‌న ఇన్నింగ్స్‌.. వ‌రుస‌గా 5 బంతుల్లో 5 సిక్స‌ర్లు.. తృటిలో యువీ రికార్డు మిస్‌..వీడియో

అఫ్గానిస్తాన్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ న‌బీ (Mohammad Nabi) ఒకే ఓవ‌ర్‌లో వ‌రుస‌గా ఐదు బంతుల్లో ఐదు సిక్స‌ర్లు బాదాడు.

Mohammad Nabi : న‌బీ సంచ‌ల‌న ఇన్నింగ్స్‌.. వ‌రుస‌గా 5 బంతుల్లో 5 సిక్స‌ర్లు.. తృటిలో యువీ రికార్డు మిస్‌..వీడియో

Asia Cup 2025 Mohammad Nabi smacks five sixes in final over vs Sri Lanka

Updated On : September 19, 2025 / 9:33 AM IST

Mohammad Nabi : అఫ్గానిస్తాన్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మ‌హ్మ‌ద్ న‌బీ పెను విధ్వంసం సృష్టించాడు. ఆసియాక‌ప్ 2025లో భాగంగా శ్రీలంక‌తో గురువారం అబుదాబి వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. వ‌రుస‌గా ఐదు బంతుల్లో 5 సిక్స‌ర్లు బాదాడు. కొద్దిలో టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు యువ‌రాజ్ సింగ్ రికార్డును మిస్ అయ్యాడు.

సూప‌ర్ 4కి చేరుకోవాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంక బౌల‌ర్ల ధాటికి 79 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయింది. ర‌షీద్ ఖాన్ (24) ఔట్ అయ్యే స‌మ‌యానికి 17.1 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 114 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. అప్ప‌టికి న‌బీ క్రీజులో ఉన్నాడు.

SL vs AFG : అఫ్గానిస్తాన్ ఆశలపై దెబ్బ కొట్టిన శ్రీలంక.. బ‌తికిపోయిన బంగ్లాదేశ్..

ఆఖ‌రి ఓవ‌ర్‌లో పెను విధ్వంసం..

అప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా బ్యాట్ ఝుళిపించ‌ని న‌బీ(Mohammad Nabi).. 19 ఓవ‌ర్ నుంచి గేర్ మార్చాడు. ఇన్నింగ్స్ 19వ ఓవ‌ర్‌ను చ‌మీర వేయ‌గా తొలి మూడు బంతుల‌ను మూడు ఫోర్లుగా మ‌లిచాడు. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు వ‌చ్చాయి. ఆ త‌రువాత ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌ను స్పిన్న‌ర్ దునిత్ వెల్లలాగే వేశాడు. అంతే.. న‌బీ రెచ్చిపోయాడు. వ‌రుస‌గా మూడు బంతుల‌ను సిక్స‌ర్లుగా బాదాడు. దీంతో ఒత్తిడి లోనైన దునిత్ నో బాల్ వేశాడు. దీంతో ఫ్రీ హిట్ ల‌భించ‌గా దాన్ని న‌బీ సిక్స‌ర్‌గా మ‌లిచాడు. ఆ త‌రువాత బంతికి కూడా సిక్స్ బాదాడు.

Hardik Pandya : ఒమ‌న్‌తో మ్యాచ్‌.. హార్దిక్ పాండ్యాను ఊరిస్తున్న భారీ రికార్డు..

దీంతో 5 బంతుల్లో 5 సిక్స‌ర్లు బాదిన న‌బీ.. యువీ ఆరు సిక్స‌ర్ల రికార్డు పై క‌న్నేసిన‌ట్లుగా క‌నిపించింది. అయితే.. ఆఖ‌రి బంతికి షాట్ క‌నెక్ట్ కాలేదు. రెండు ప‌రుగుకు ప్ర‌య‌త్నించి నబీ ర‌నౌట్ అయ్యాడు. అయిన‌ప్ప‌టికి ఆఖ‌రి ఓవ‌ర్‌లో 32 ప‌రుగులు పిండుకున్నాడు. న‌బీ ధాటికి అఫ్గాన్ జ‌ట్టు చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో 49 ప‌రుగులు సాధించింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగులు చేసింది. లంక బౌల‌ర్ల‌లో దునిత్ వెల్లలాగే, చ‌మీర‌, ధ‌సున్ శ‌న‌క‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

లంక అల‌వోక‌గా..

170 ప‌రుగుల ల‌క్ష్యాన్ని శ్రీలంక జ‌ట్టు 18.4 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది. కుశాల్ మెండీస్ (74నాటౌట్; 52 బంతుల్లో 10 ఫోర్లు) దంచికొట్టాడు. కుశాల్ పెరీరా(28), మిందు మెండిస్‌ (26 నాటౌట్‌) లు రాణించారు. అఫ్గాన్ బౌల‌ర్ల‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్ త‌లా ఓ వికెట్ సాధించారు.