Bangalore stampede RCB marketing head arrested
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే ను పోలీసులు అరెస్టు చేశారు.
ముంబై వెళ్లేందుకు అతడు బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లగా అక్కడ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా విజయోత్సవ ఈవెంట్ నిర్వాహకులైన DNA ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది..కిరణ్, సుమంత్, సునీల్ మాథ్యూలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో వీరిని విచారిస్తున్నట్లు సమాచారం.
తొక్కిసలాట ఘటనపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆర్‌సీబీ, ఈవెంట్ ఆర్గనైజేషన్ కంపెనీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ)లను నిందితులుగా చేర్చారు. KSCA కార్యదర్శి, కోశాధికారి పరారీలో ఉన్నారని చెబుతున్నారు. పోలీసులు వారి ఇంటికి వెళ్లగా.. అక్కడ వారు లేనట్లుగా తెలుస్తోంది.
ఆర్సీబీ టీమ్ మేనేజ్‌మెంట్ లో నిఖిల్ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ విజయోత్సవ ఈవెంట్‌ను కూడా డీఎన్‌ఏ సంస్థతో కలిసి ఆయనే సమన్వయం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
జూన్4న జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 64 మంది గాయపడిన విషయం తెలిసిందే.