BCCI New Rule
BCCI New Rule : బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మల్టీడే మ్యాచ్‌ల కోసం దేశవాళీ క్రికెట్లో కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఆగస్టు 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానున్నట్లు బీసీసీఐ (BCCI) తెలిపింది.
ఇంగ్లాండ్ వేదికగా ఆండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇటీవల ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ సమం అయింది. అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్‌లు గాయపడ్డారు. వీరి స్థానంలో కొత్త ఆటగాళ్లను తీసుకునే అవకాశం లేకుండా అంతర్జాతీయ క్రికెట్లో నిబంధనలు ఉన్నాయి.
గాయపడిన ప్లేయర్ స్థానంలో కేవలం సబ్‌స్టిట్యూట్ గా వచ్చిన ఆటగాళ్లు ఫీల్డింగ్ మాత్రమే చేయాలి.. బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశం ఉండదు.. దీంతో నాలుగో టెస్టులో పంత్ పాదం విరగగా .. అయిదో టెస్టులో వోక్స్ భుజంకు గాయం అయింది. వారి స్థానంలో కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకునే అవకాశం లేకుండా పోయింది. గాయంతో ఇబ్బంది పడుతూనే వాళ్లు బ్యాటు పట్టుకొని క్రీజులోకి రావాల్సి వచ్చింది. ఈ సమయాల్లో ఆటగాళ్లు మరింతగా గాయపడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో గాయపడిన ఆటగాళ్లు మ్యాచ్‌లో కొనసాగుతూ తమను తాము మరింత ప్రమాదంలో పడకుండా నిరోధించడానికి దేశవాలీ క్రికెట్‌లో ఆటగాళ్ల భర్తీకి బీసీసీఐ అవకాశం కల్పించింది. అంటే.. మ్యాచ్ సందర్భంగా ఆటగాడు తీవ్రంగా గాయపడితే అతని స్థానంలో అలాంటి మరో అటగాణ్ని అనుమతించవచ్చునని సవరించిన ఆట నిబంధనల్లో బీసీసీఐ పేర్కొంది.
బీసీసీఐ కొత్త నిబంధన అమలు ఇలా..
♦ మ్యాచ్ మధ్యలో బంతి తగలడం ద్వారా ఫ్రాక్చర్ లేదా డిస్‌లొకేషన్ వంటి తీవ్రమైన గాయాలు జరిగి, అతడు మ్యాచ్‌లో ఆడే పరిస్థితి లేనప్పుడు మరో ఆటగాడిని తీసుకుంటారు.
♦ మొదట ఫీల్డ్ అంపైర్ గాయం తీవ్రతను పరిశీలిస్తారు. అవసరమైతే మ్యాచ్ రిఫరీ, డాక్టర్ల సలహా తీసుకుంటారు.
♦ ఆ తర్వాత గాయపడ్డ ఆటగాడికి సంబంధించిన టీమ్ మేనేజర్ గాయం తీవ్రతపై లిఖిత పూర్వకంగా మ్యాచ్ రిఫరీకి వివరాలు చెప్పాలి.
♦ ఒకసారి ప్రత్యామ్నాయ ఆటగాడు మైదానంలోకి వస్తే.. గాయపడిన ఆటగాడు మళ్లీ ఆ మ్యాచ్ ఆడలేడు.
♦ ప్రత్యామ్నాయ ఆటగాడి విషయంలో తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీదే.
♦ ఏ జట్టుకు కూడా దీనిపై అప్పీల్ చేసే హక్కు ఉండదు.