Big blow to New Zealand ahead of Champions Trophy final against India
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం (మార్చి 9న) దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం సాధించి 2000వ సంవత్సరంలో కెన్యా వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
గ్రూప్ స్టేజీలో విజయం సాధించిన భారత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అయితే.. ఫైనల్ మ్యాచ్ ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయపడ్డాడు. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా హెన్రీ భుజానికి గాయమైంది. ఓ క్యాచ్‌ను అందుకునే క్రమంలో అతడి భుజం నేలను బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడాడు. వెంటనే మైదానాన్ని వీడాడు.
ఈ క్రమంలో అతడు ఫైనల్ మ్యాచ్ ఆడడం పై సందిగ్దం నెలకొంది. గాయం తీవ్రత మరీ ఎక్కువై.. అతడు ఫైనల్‌కు దూరం అయితే అది కివీస్‌కు భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. గ్రూప్ స్టేజీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హెన్రీ 8 ఓవర్లు వేసి 42 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ బౌలింగ్ ఎటాక్‌ను హెన్రీ ముందుండి నడిపించాడు. పాకిస్తాన్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయగా, బంగ్లాదేశ్ పై ఓ వికెట్ సాధించాడు. భారత్ పై ఏకంగా ఐదు వికెట్లు తీసి కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
హెన్రీ గాయం పై మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పందించాడు. పేసర్ హెన్రీ భుజం నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. భారత్‌తో ఫైనల్ మ్యాచ్ కు ఇంకో మూడు రోజులు సమయం ఉందని, అప్పటి వరకు అతడు కోలుకుంటాడా?లేదా అన్నది ఇప్పుడే చెప్పడం కాస్త కష్టమన్నాడు. భారత్‌తో ఫైనల్ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.