Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శుక్రవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కి అర్హత సాధిస్తుంది. ఓడిపోయిన జట్టు ఈ సీజన్ నుంచి నిష్ర్కమిస్తుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరా హోరీగా జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ కీలక మ్యాచ్ ముందు హెడ్-టు-హెడ్ రికార్డులు ముంబై ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ముంబై, గుజరాత్ జట్లు 7 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో 5 మ్యాచ్‌ల్లో గుజరాత్ విజయం సాధించగా మరో రెండు మ్యాచ్‌ల్లో ముంబై గెలుపొందింది.
ఇక ఈ ఐపీఎల్ సీజన్‌లో రెండు సందర్భాల్లో ముంబై, గుజరాత్‌లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గుజరాత్ విజయం సాధించడం గమనార్హం. ఇప్పుడు ఇదే విషయం ముంబై ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోంది. ఎలిమినేటర్‌లో తమ జట్టును గెలిపించాలని పూజలు చేస్తున్నారు.
ఫైనల్‌కు చేరాలంటే..
ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరుకుంది. కాగా.. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. క్వాలిఫయర్-2లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీతో కప్పు కోసం పోటీపడనుంది.
జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ 2025 మ్యాచ్ జరగనుంది.