RCB : ఐపీఎల్ 2025 ఫైన‌ల్‌కు ముందు ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు కొత్త టెన్ష‌న్‌.. మ‌రోసారి అదే జ‌రిగితే క‌ప్పు గోవిందా?

ఆర్‌సీబీ ఫైన‌ల్‌కు చేరుకోవడం ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇది నాలుగో సారి.

RCB : ఐపీఎల్ 2025 ఫైన‌ల్‌కు ముందు ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు కొత్త టెన్ష‌న్‌.. మ‌రోసారి అదే జ‌రిగితే క‌ప్పు గోవిందా?

New tension to RCB fans ahead of IPL 2025 Final

Updated On : May 30, 2025 / 10:32 AM IST

ప్ర‌తీసారి కప్ మ‌న‌దే అంటూ రావ‌డం, ఆ తరువాత నిరాశ ప‌ర‌చ‌డం గ‌త కొన్నాళ్లుగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తీరు ఇది. అయితే.. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో మాత్రం ఆర్‌సీబీ అద‌ర‌గొడుతోంది. చిర‌కాల స్వ‌ప్నాన్ని సాకారం చేసుకోవ‌డానికి కేవ‌లం అడుగుదూరంలో నిలిచింది. గురువారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్ 1లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి ఫైన‌ల్‌కు చేరుకుంది. జూన్ 3న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

దాదాపు 9 ఏళ్ల విరామం త‌రువాత ఆర్‌సీబీ ఫైన‌ల్ మ్యాచ్‌లో అడుగుపెట్టింది. ఆర్‌సీబీ ఫైన‌ల్‌కు చేరుకోవడం ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇది నాలుగో సారి. 2009, 2011, 2016లోనూ ఫైన‌ల్ చేరుకున్న‌ప్ప‌టికి నిరాశ త‌ప్ప‌లేదు. ఇప్పుడు ఆర్‌సీబీ ఫైన‌ల్‌కు చేరుకోవ‌డంతో ఆ మూడు ఫైన‌ల్స్‌లో ఏం జ‌రిగిందో ఓ సారి చూద్దాం..

2009 ఫైన‌ల్‌..
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2008లో ఆరంభమైంది. తొలి సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిరాశ‌జ‌న‌క ప్ర‌ద‌ర్శ‌న చేసింది. పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి నుంచి రెండో స్థానం (ఏడో) స్థానంతో టోర్నీని ముగించింది. అయితే.. రెండో సీజ‌న్‌ లో మాత్రం అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌క్రిందులు చేస్తూ అనిల్ కుంబ్లే సార‌థ్యంలో ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది.

PBKS vs RCB : స‌ర్ఫ‌రాజ్ ఖాన్ త‌మ్ముడిని స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. వీడియో వైర‌ల్‌..

ఫైన‌ల్‌లో డెక్కన్ ఛార్జర్స్‌తో త‌ల‌ప‌డింది. గిల్ క్రిస్ట్ నాయ‌క‌త్వంలోని డెక్క‌న్ ఛార్జ‌ర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 143 ప‌రుగులు చేసింది. డీసీ బ్యాట‌ర్ల‌లో హెర్షెల్ గిబ్స్ (53) హాఫ్ సెంచ‌రీ బాద‌గా ఆండ్రూ సైమ‌న్స్ (33), రోహిత్ శ‌ర్మ (24) లు రాణించారు. అనంత‌రం ల‌క్ష్య‌ఛేద‌న‌లో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 137 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (32), రాస్ టేల‌ర్ (27)ల‌తో పాటు రాబిన్ ఉత‌ప్ప (17 నాటౌట్‌) రాణించిన‌ప్ప‌టికి ఆర్‌సీబీ 6 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

2011 ఫైన‌ల్‌..

2011 సంవ‌త్స‌రంలో ఆర్‌సీబీ రెండో సారి ఐపీఎల్ ఫైన‌ల్ చేరుకుంది. ఈ సారి డేనియ‌ర్ వెటోరీ ఆర్‌సీబీని ముందుండి న‌డిపించాడు. అయితే.. ఫైన‌ల్‌లో మ‌హేంద్ర సింగ్ ధోని నాయ‌క‌త్వంలోని చెన్నై ఆర్‌సీబీకి అడ్డుప‌డింది.

PBKS vs RCB : ఆర్‌సీబీపై ఓట‌మి.. పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కామెంట్స్ వైర‌ల్‌.. ‘యుద్ధం ఓడిపోలేదు.. పోరు మాత్ర‌మే..’

ఈ మ్యాచ్‌లో చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో ముర‌ళీ విజ‌య్ (95) తృటిలో శ‌త‌కం చేజార్చుకోగా మైఖేల్ హ‌స్సీ(63) హాఫ్ సెంచ‌రీ బాదాడు. ఆ త‌రువాత భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో ఆర్‌సీబీ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 147 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఆర్‌సీబీ బ్యాట‌ర్ల‌లో సౌర‌వ్ తివారీ (42), విరాట్ కోహ్లీ (35) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. క్రిస్ గేల్ (0), ఏబీ డివియ‌ర్స్ (18)లు విఫ‌లం కావ‌డంతో మ‌రోసారి ఆర్‌సీబీకి నిరాశే త‌ప్ప‌లేదు.

2016 ఫైన‌ల్‌..
ముచ్చ‌ట‌గా మూడో సారి ఆర్‌సీబీ 2016 ఐపీఎల్‌లో ఫైన‌ల్‌కు చేరుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ భీక‌ర ఫామ్‌తో జ‌ట్టును ఫైన‌ల్‌కు చేర్చాడు. కోహ్లీ ఊపు చూస్తే ఆర్‌సీబీ మూడో ప్ర‌య‌త్నంలో విజ‌యం సాధించి క‌ప్పును ముద్దాడుతుంద‌ని చాలా మంది భావించారు. అయితే.. డేవిడ్ వార్న‌ర్ నేతృత్వంలోని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ఆర్‌సీబీకి గ‌ట్టి షాక్ ఇచ్చింది.

ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 208 ప‌రుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ (69) హాఫ్ సెంచ‌రీ చేశాడు. యువరాజ్ సింగ్ (38), బెన్ క‌ట్టింగ్ (39 నాటౌట్‌)లు రాణించారు. అనంత‌రం క్రిస్ గేల్ (38 బంతుల్లో 76), విరాట్ కోహ్లీ (35 బంతుల్లో 54) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగినా కూడా ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగుల ద‌గ్గ‌ర ఆగిపోయింది. ఏబీ డివిలియ‌ర్స్ (5), కేఎల్ రాహుల్ (11), షేన్ వాట్స‌న్ (11). స్టువ‌ర్ట్ బిన్ని (9) లు విఫ‌లం కావ‌డంతో ఆర్‌సీబీ 8 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

PBKS vs RCB : ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ కీల‌క వ్యాఖ్య‌లు.. తొంద‌రొద్దు.. ఇంకో..

కాగా.. ఈ మూడు సంద‌ర్భాల్లో కూడా ఆర్‌సీబీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలో జూన్ 3న జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ తొలుత బ్యాటింగ్ చేయాల‌ని ఆ జ‌ట్టు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 18 ఏళ్లుగా ఊరిస్తున్న టైటిల్‌ను అందుకోవాల‌ని ఆ జ‌ట్టు అభిమానులు కోరుకుంటున్నారు.