CAB has written letter to the BCCI to not allow Harsha Bhogle and Simon Doull to commentate at Eden Gardens
ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాతలు హర్షా భోగ్లే, సైమన్ డౌల్ పై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఇక పై కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు వీరిని అనుమతించొద్దని, ఆ మ్యాచ్‌లపై వారు కామెంటరీ చేయకుండా నిషేదం విధించాలని బీసీసీఐని క్యాబ్ కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ పిచ్ క్యూరేటర్ పై వీరిద్దరు చేసిన వ్యాఖ్యలే అందుకు కారణంగా తెలుస్తోంది. ఫ్రాంఛైజీ డిమాండ్లకు అనుగుణంగా పిచ్‌లు సిద్ధం చేయడంలో హోం గ్రౌండ్ క్యూరేటర్ సహకారం లేకపోయినట్లే.. రహానే సారథ్యంలోని కేకేఆర్ టీమ్ మరో హోం గ్రౌండ్‌ను చూసుకోవాలని డౌల్ సూచించాడు. అదే విధంగా హర్షా భోగ్లే సైతం ఈడెన్ పిచ్ పై అసహనం వ్యక్తం చేశాడు. హోంగ్రౌండ్‌లో ఆడుతుంటే వారికి ఉపయోగపడేలా పిచ్‌లను సిద్ధం చేయాలన్నాడు.
అయితే.. క్యాచ్ ఈ విషయంలో క్యూరేటర్‌కి మద్దతుగా నిలిచింది. అతడు ఏ తప్పు చేయలేదని తెలిపింది. బీసీసీఐ నిబంధనల ప్రకారమే పిచ్ లను తయారు చేస్తారని తెలిపింది.
కాగా.. క్యాబ్ లేఖపై ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే.. నేడు (సోమవారం ఏప్రిల్ 21)న కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో వీరిద్దరు కామెంట్రీ చేసే అవకాశం లేదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ సైతం ఈడెన్ గార్డెన్స్ వేదికగానే జరగనుంది.
ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ.. ఇరు జట్ల ఆటగాళ్లు పిచ్ మీద ఆడటానికి ఇబ్బందులు పడినట్లుగా వెల్లడించాడు. దీనిపైనే సైమన్ డౌల్, హర్షా భోగ్లేలు మాట్లాడారు.