Team india
Champions Trophy: ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. పాకిస్థాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఈనెల 19 (బుధవారం) నుంచి ప్రారంభమవుతుంది. టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఈనెల 20వ తేదీన బంగ్లాదేశ్ జట్టుతో ఆడనుంది. భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగానే జరగనున్నాయి. అయితే, మరో రెండు రోజుల్లో మ్యాచ్ ఆడాల్సిన సమయంలో భారత్ జట్టుకు బిగ్ షాక్ తగింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫేవరెట్ జట్లలో టీమిండియా కూడా ఒకటి. టీమిండియా బ్యాటర్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేశారు. అయితే, టీమిండియా జట్టును బౌలింగ్ విభాగం ఆందోళనకు గురిచేస్తోంది. జట్టులో ప్రధాన బౌలర్ జస్ర్పీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. బుమ్రా దూరం కావటం టీమిండియా బౌలింగ్ విభాగానికి గట్టిదెబ్బే. అయితే, జట్టులోకి మహ్మద్ షమీ వచ్చినా.. బుమ్రా లేనిలోటును షమీ పూడ్చగలడా అనే సందేహాలు లేకపోలేదు. షమీతో పాటు అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణాలు ఉన్నారు. అయితే, వారికి పెద్దగా వన్డే అనుభవం లేదు. అర్ష్ దీప్ కేవలం తొమ్మిది వన్డేలే ఆడగా.. హర్షిత్ రాణా మూడే వన్డేలు ఆడాడు.
Also Read: ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా నుంచి హయ్యస్ట్ రన్స్ చేసిన టాప్ 5 తోపులు వీళ్లే…
ప్రధాన బౌలర్ జస్ర్పీత్ బుమ్రా లేకుండానే బరిలోకి దిగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత బౌలర్లు ఏమేరకు రాణిస్తారనే అంశం ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ క్రమంలో భారత జట్టుకు బ్యాడ్ న్యూస్ ఎదురైంది. జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లాడు. తన తండ్రి మరణంతో అతడు దుబాయ్ నుంచి స్వదేశానికి పయనమైనట్లు తెలిసింది. అయితే, అతను ఎప్పుడు తిరిగి వస్తాడనే విషయంపై స్పష్టత లేదు. అతడు లేకపోవటం ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు లోటేనని పలువురు మాజీలు పేర్కొంటున్నారు. టీమిండియా బౌలింగ్ సమర్ధతపై సందేహాలు వ్యక్తమవుతున్నవేళ బౌలింగ్ కోచ్ అందుబాటులో లేకపోవటం జట్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఈనెల 20న బంగ్లాదేశ్ పై భారత్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు ఏ స్థాయిలో రాణిస్తారో వేచి చూడాల్సిందే.